Share News

Paris Plympics: బంగారు పతకంపై ఆశలు.. జావెలిన్ త్రోలో ఫైనల్స్‌ చేరిన నీరజ్ చోప్రా

ABN , Publish Date - Aug 06 , 2024 | 03:46 PM

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడిపై ఆశలు సజీవంగా ఉంచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూప్-బిలో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

Paris Plympics: బంగారు పతకంపై ఆశలు.. జావెలిన్ త్రోలో ఫైనల్స్‌ చేరిన  నీరజ్ చోప్రా
Neeraj Chopra

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడిపై ఆశలు సజీవంగా ఉంచాడు. జావెలిన్ త్రో గ్రూప్-బి క్వాలిఫికేషన్ రౌండ్‌లో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గ్రూప్-ఎలో ఫైనల్స్‌కు అర్హత సాధించి మొదటి స్థానంలో నిలిచిన జర్మనీ క్రీడాకారుడు 87.76 మీటర్లు విసరగా.. నీరజ్ 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్ చేరారు. ఆగష్టు 8వ తేదీన జరిగే ఫైనల్స్‌లో పతకం కోసం పోటీపడతాడు. ప్రపంచస్థాయి పోటీల్లో 89.94 మీటర్ల దూరంలో త్రో చేసిన నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో 89.34 మీటర్లు విసరడం తన రెండో అత్యుత్తమ త్రో. సాధారణంగా ఒలింపిక్స్‌లో 85 మీటర్లు ఎవరైతే త్రో చేస్తారో వారు నేరుగా ఫైనల్స్‌కు క్వాలిఫై అవుతారు. ఎక్కువమంది 85 మీటర్లు విసిరితే అప్పుడు ఎక్కువ దూరం విసిరిన వాళ్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తారని భారత్ ఆశలు పెట్టుకుంది. జావెలిన్‌ త్రో గ్రూప్-ఎలో కిషోర్ జెనా నిరాశపర్చినప్పటికీ నీరజ్ చోప్రా పతకం ఆశలను సజీవంగా ఉంచాడు. 80.73 మీటర్లు త్రో చేసి కిశోర్ 9వ స్థానంలో నిలిచాడు.


పసిడిపై ఆశలు..

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు 3 కాంస్య పతకాలు గెలుచుకోగా.. ఆ పతకాలన్నీ షూటింగ్‌లో దక్కాయి. ఇప్పటివరకు ఒక పసిడి పతకం గెలుచుకోలేదు. బ్యాడ్మింటన్‌లో పసిడి పతకం వస్తుందని ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది. ఇక బంగారు పతకం ఆశలు నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు సజీవంగా ఉంచాడు. తొలి ప్రయత్నంలో ఫైనల్స్‌కు క్వాలిఫై అవ్వడంతో పాటు.. గ్రూప్-ఎ, గ్రూప్-బిలో సైతం అందరికంటే ఎక్కువ దూరం విసిరిన క్రీడాకారుడిగా నీరజ్ నిలిచాడు. దీంతో ఫైనల్స్‌లో తప్పకుండా నీరజ్ చోప్రా మంచి ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది. గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించిన మరో క్రీడాకారుడు గ్రెనడియన్‌కు చెందిన అండర్సన్ పీటర్స్. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన నదీమ్ 86.59 మీటర్లు విసిరి గ్రూప్-బి నుంచి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో అందరికంటే ఎక్కువ దూరం త్రో చేసిన నీరజ్ చోప్పా ఫైనల్స్‌లో మరోసారి సత్తా చాటి.. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పసిడి ఆశలను నెరవేరుస్తారని భారతీయులంతా ఆకాంక్షిస్తున్నారు.


టోక్యోలో..

2020 టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో పురుషుల విభాగంలో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. అప్పట్లో 87.58 మీటర్లు విసిరి పతకం సాధించాడు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే 1.76 మీటర్లు ఎక్కువ దూరం త్రో చేశాడు. దీంతో పారిస్ ఒలింపక్స్ ఫైనల్స్‌లో జావెలిన్ త్రో పురుషుల విభాగంలో నీరజ్ చోప్రా పతకం సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 06 , 2024 | 04:25 PM