Share News

Paralympics 2024: వావ్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

ABN , Publish Date - Sep 02 , 2024 | 06:02 PM

ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్‌ 2024లో నితేష్ కుమార్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ (Nitish Kumar) బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ క్రమంలో స్వర్ణం సాధించి భారత్‌కు రెండో గోల్డ్ పతకాన్ని అందించాడు.

Paralympics 2024: వావ్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
Nitish Kumar won gold

పారిస్ పారాలింపిక్స్ 2024(paris paralympics 2024)లో భారత్‌కు రెండో బంగారు పతకం లభించింది. పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ SL3 విభాగంలో పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నితీష్ కుమార్(Nitish Kumar) ఈ పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ పారాలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం 9 పతకాలు లభించాయి. పారా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 ఈవెంట్ ఫైనల్లో నితేష్ కుమార్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్‌తో తలపడ్డాడు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొనగా, చివరకు నితీష్ కుమార్ 21-14, 18-21, 23-21 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించాడు.


తొలి ఆటగాడిగా రికార్డు

ప్రస్తుతం జరుగుతున్న పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన తొలి ఆటగాడిగా నితీష్ రికార్డు సృష్టించాడు. తొలి సెట్‌లో నితీశ్‌ కుమార్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రత్యర్థికి అసలు అవకాశం ఇవ్వలేదు. భారత ఆటగాడు నితీష్ కుమార్‌పై డేనియల్ బెతెల్ ఘోరంగా ఓడిపోయాడు. నితీష్ ఆరంభం నుంచి తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. దీంతో 21-14తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా కనిపించాయి. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెతెల్ ఈ సెట్‌లో చాలా దూకుడుగా కనిపించాడు. ఈ సెట్‌లో నితేష్ చాలా తప్పులు చేశాడు.


చివరి సెట్‌లో

చివరికి ఈ సెట్‌ను 21-18తో బెతెల్ గెలుచుకున్నాడు. రెండో సెట్‌ను గెలుచుకున్న వెంటనే 1-1తో మ్యాచ్‌ను సమం చేశాడు. ఆ తర్వాత మూడో సెట్‌లో నితీశ్ కుమార్ పునరాగమనం చేసి 23-21తో ఈ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. సెట్ గెలవడంతో పాటు గోల్డ్ మెడల్ కూడా దక్కించుకున్నాడు. 2009 విశాఖపట్నంలో జరిగిన రైలు ప్రమాదంలో నితీష్‌ కాలు కోల్పోయాడు. 15 ఏళ్ల వయసులో అతనికి జరిగిన ప్రమాదంతో జీవితం మలుపు తిరిగింది. ఆ క్రమంలో మంచం మీద పడుకుని అనేక రోజులు చాలా డిప్రెషన్‌కు గురయ్యాడు.


రైలు ప్రమాదంలో

కానీ పూణెలోని కృత్రిమ అవయవాల కేంద్రాన్ని సందర్శించడం నితీష్ దృక్పథాన్ని మార్చేసింది. తన బాల్యం కాస్త భిన్నమైనదని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ఫుట్‌బాల్ ఆడే క్రమంలో ఆ క్రీడను శాశ్వతంగా విడిచిపెట్టవలసి వచ్చింది. తర్వాత చదువు ప్రారంభించాడు. ఆ క్రమంలోనే ఐఐటీ మండిలో చదువుతున్నప్పుడు బ్యాడ్మింటన్ గురించి నితీష్ తెలుసుకున్నాడు. ఆ క్రమంలో ప్రమోద్ భయ్యా ఆయనలో స్ఫూర్తిని నింపారు. తర్వాత క్రమశిక్షణతో ఆటను నేర్చుకోవడం ఆరంభించాడు. ఈ ఆట అతనికి మరింత బలాన్ని ఇవ్వగా ఇప్పుడు గోల్డ్ మెడల్ గెల్చుకునే స్థాయికి చేరుకున్నాడు. టాప్ సీడ్ నితీష్ సెమీ ఫైనల్లో జపాన్‌కు చెందిన డైసుకే ఫుజిహారాపై వరుస గేమ్‌ల విజయంతో పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్ 3 కేటగిరీ ఫైనల్‌లోకి ప్రవేశించాడు.


ఇవి కూడా చదవండి..

Paralympics 2024: పారాలింపిక్స్ ఐదో రోజు.. భారత్ ఖాతాలో 8వ పతకం..


నిషద్‌కు రజతం

Sheetal Devi: అబ్బురపరిచిన పారా ఆర్చర్ శీతల్ దేవి.. కాలితోనే విల్లు ఎత్తి సూపర్ షాట్..


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2024 | 06:24 PM