Swapnil Kushale : ఖుష్.. కుశాలె
ABN , Publish Date - Aug 02 , 2024 | 04:36 AM
పారిస్ గేమ్స్ పతక రేసులో ఉన్నారంటూ ఎవరెవరి గురించో మాట్లాడుకున్నారు.. కానీ అతడి గురించి ఎవరికీ అంచనాల్లేవు. కనీసం ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడన్న ఆశలు కూడా పెట్టుకోలేదు. అనామకుడిగా బరిలోకి దిగిన.. 28 ఏళ్ల షూటర్ స్వప్నిల్ కుశాలె లక్ష్యంపైనే గురి పెట్టాడు. చివరకు ఎవరికీ పట్టింపులేని
50మీ. రైఫిల్3 పొజిషన్స్‌లో కాంస్యం
సిఫ్ట్ కౌర్, అంజుమ్ విఫలం
స్వప్నిల్ కెరీర్
పారిస్ గేమ్స్ పతక రేసులో ఉన్నారంటూ ఎవరెవరి గురించో మాట్లాడుకున్నారు.. కానీ అతడి గురించి ఎవరికీ అంచనాల్లేవు. కనీసం ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడన్న ఆశలు కూడా పెట్టుకోలేదు. అనామకుడిగా బరిలోకి దిగిన.. 28 ఏళ్ల షూటర్ స్వప్నిల్ కుశాలె లక్ష్యంపైనే గురి పెట్టాడు. చివరకు ఎవరికీ పట్టింపులేని తనను ప్రపంచమే గుర్తించేలా చేసుకున్నాడు. షూటింగ్‌లో అతిక్లిష్టమైన 50మీ. రైఫిల్3 పొజిషన్స్‌లో కంచు మోతతో తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవడమే కాదు.. దేశం గర్వపడేలా చేశాడు. ఎంఎస్ ధోనీని అమితంగా ఆరాధించే స్వప్నిల్ అతడి మాదిరే ఒత్తిడిలోనూ మిస్టర్ కూల్‌గా పనికానిచ్చేసి.. ఈ విభాగంలో మెడల్ కొట్టిన తొలి భారత షూటర్‌గానూ నిలిచాడు.
‘దేశానికి మెడల్ అందించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఏమీ తినకుండా కేవలం బ్లాక్ టీ తాగి బరిలోకి దిగాను. అలాగే పోటీలో స్కోరుబోర్డును పట్టించుకోకుండా నా శ్వాసపైనే ఎక్కువగా దృష్టి సారించాను. ఈ స్థాయికి చేరుకోవడం నా 12 ఏళ్ల శ్రమ ఫలితం. ఫైనల్లోనూ అదే విషయం నా మనసులో ఉండిపోయింది. కొన్నేళ్లుగా విజయం కోసం చూస్తున్న నేను ఈ పతకంతో అందరినీ గర్వపడేలా చేశాను’
- స్వప్నిల్ కుశాలె
పారిస్: భారత షూటర్లు పతక పండుగ చేసుకుంటూ క్రీడాభిమానులను మురిపిస్తున్నారు. చివరి రెండు ఒలింపిక్స్‌లో తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ.. ఈసారి మాత్రం తమ అద్భుత ప్రదర్శనతో దేశానికి హ్యాట్రిక్ పతకం అందించారు. గురువారం జరిగిన 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్‌లో స్వప్నిల్ కుశాలె (451.4 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. తొలిసారి మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగిన తను క్వాలిఫయింగ్‌లో ఏడో స్థానంలో నిలవడమే కాకుండా ఫైనల్ రౌండ్‌లోనూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రోన్, స్టాండింగ్ దశల్లో ప్రశాంతత, స్థిరత్వంతో కూడిన ప్రదర్శనతో పోడియం ఫినిష్ చేశాడు. ఈ విభాగంలో చైనాకు చెందిన లియూ యుకున్ (453.7) స్వర్ణం, సెరియ్ కులిష్ (461.3, ఉక్రెయిన్) రజతం అందుకున్నారు.
ఆరో స్థానం నుంచి ఎగబాకి..: కఠినంగా సాగిన ఫైనల్స్‌లో స్వప్నిల్ ఆరంభం నిదానంగానే సాగింది. కానీ క్రమంగా అంతులేని ఏకాగ్రతతో ఒక్కో స్థానం మెరుగుపర్చుకుంటూ పతక ఆశలు రేపాడు. ఫైనల్లో పాల్గొన్న 8 మంది ముందుగా 40 షాట్లు సంధించారు. ఇందులో తొలి 15 నీలింగ్ (మోకాళ్ల మీద కూర్చుని), ఆ తర్వాత 15 ప్రోన్ (బోర్లా పడుకుని), మిగిలిన 10 స్టాండింగ్ (నిలబడి) పొజిషన్‌లో షూట్ చేశారు. ఈ క్రమంలో స్వప్నిల్‌కు ఆరంభంలో గురి సరిగ్గా కుదరలేదు. తొలి షాట్‌ను 9.6తో ఆరంభించగా నీలింగ్ పొజిషన్‌ను ఆరో స్థానంతో ముగించాడు. కానీ ప్రోన్‌లో మాత్రం అద్భుతంగా పుంజుకున్నాడు. ఐదు షాట్లను ఇన్నర్ 10గా ముగించడంతో 310.1 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకాడు. చివరగా స్టాండింగ్‌లోనూ అదరగొట్టి మూడో స్థానంలో నిలవగలిగాడు. ఇక ప్రతీ షాట్‌కు ఓ షూటర్ తప్పుకొనే కీలక ఎలిమినేషన్ రౌండ్‌లోనూ స్వప్నిల్ తడబాటుకు గురవకుండా టాప్-4కు వెళ్లాడు. ఇందులో 9.9 స్కోరుతో 441.4 పాయింట్లు సాధించి టాప్-3లో ఎంట్రీ ఇవ్వడంతో మెడల్ ఖరారైంది. ఫైనల్ షాట్‌లో 10 స్కోరు చేయడంతో (451.4) 0.5 పాయింట్ల తేడాతో స్వప్నిల్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. అతడికన్నా ముందున్న కులిష్ 451.9తో టాప్-2 కోసం చైనా షూటర్‌తో పోటీపడ్డాడు.
సిఫ్ట్, అంజుమ్ ఫ్లాప్ షో: మహిళల 50మీ. రైఫిల్ 3 పొజిషన్‌లో ప్రపంచ రికార్డు నేపథ్యం కలిగిన సిఫ్ట్ కౌర్ శర్మపై, మాజీ వరల్డ్ చాంపియన్ అయిన అంజుమ్ మౌద్గిల్‌పై ముందునుంచీ పతక అంచనాలున్నాయి. కానీ అందరినీ తీవ్రంగా నిరాశపరుస్తూ వీరు కనీసం ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయారు. గురువారం జరిగిన క్వాలిఫయింగ్స్‌లో మొత్తం 32 మంది షూటర్లు పాల్గొనగా.. సిఫ్ట్ 575 పాయింట్లతో 31వ స్థానంలో నిలవడం గమనార్హం. అటు అంజుమ్ 584 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచి టాప్-8కు చాలా దూరంలోనే ఉండిపోయింది.
మిస్టర్ కూల్ బుల్లెట్
కలల కోటలో చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకొన్న మిస్టర్ కూల్ బుల్లెట్ స్వప్నిల్ కుశాలె. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా.. పెద్దపెద్ద కలలనే కన్నాడు. అది నెరవేరే వరకు అకుంఠిత దీక్షతో కృషి చేశాడు.. మువ్వన్నెలను రెపరెపలాడించాడు. 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్వప్నిల్.. టోక్యో అవకాశం త్రుటిలో చేజారినా అధైర్యపడలేదు. రెట్టించిన పట్టుదలతో శ్రమించాడు.. పారిస్ బెర్త్ పట్టేశాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. అతి కష్టమైన 50 మీ రైఫిల్ 3 పొజిషన్స్‌లో కంచు మోత మోగించాడు.
అప్పుతో రైఫిల్ కొని..: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కంబల్వాడి గ్రామానికి చెందిన స్వప్నిల్ చిన్ననాటి నుంచే షూటింగ్‌పై ఆసక్తి పెంచుకొన్నాడు. ఉపాధ్యాయుడైన అతడి తండ్రి లోన్ తీసుకొని రైఫిల్ కొనిపించగా.. సర్పంచ్ అయిన అతడి తల్లి అనిత ఎంతో ప్రోత్సహించింది. భారత మాజీ షూటర్ దీపాలీ దేశ్‌పాండే శిక్షణలో రాటుదేలాడు. 2015లో ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌ప్స జూనియర్ కేటగిరీలో స్వర్ణంతో మెరిశాడు. అనంతరం జాతీయ షూటింగ్ చాంపియన్‌షి్‌ప్స 50 మీ. రైఫిల్ ప్రోన్‌లో ప్రముఖ షూటర్లు గగన్ నారంగ్, చైన్ సింగ్ లాంటి వారికే ఝలక్ ఇచ్చాడు. కెరీర్‌లో వేగంగా ఎదిగిన స్వప్నిల్.. 2022 ఆసియా క్రీడల్లో టీమ్ స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఏడాది మేలో జరిగిన ట్రయల్స్‌లో పారిస్ టికెట్ పట్టేసిన కుశాలె.. ఆడిన తొలి ఒలింపిక్స్‌లోనే పతకంతో అదరగొట్టాడు. షూటింగ్‌లో తనకు ఫేవరెట్ ఎవరూ లేకపోయినా.. ధోనీని ఆదర్శంగా తీసుకొంటానని రైల్వే టికెట్ కలెక్టర్ అయిన కుశాలె చెప్పాడు. మహీ బయోపిక్‌ను తాను ఎన్నో సార్లు చూశానని తెలిపాడు. తీవ్ర ఒత్తిడిలోనూ ధోనీలా ఎంతో కూల్‌గా ఉండడాన్ని తాను కూడా అలవర్చుకోవడానికి యత్నిస్తున్నట్టు కుశాలె చెప్పాడు. కాగా, పోటీ జరుగుతున్న సమయంలో దేవుడిని ప్రార్థిస్తూ ఎంతో ఉత్కంఠగా గడిపిన అనిత.. పతకం నెగ్గిన విషయం తెలుసుకొని తీవ్ర భావోద్వేగానికి గురైంది. తన విజయంలో తల్లిదండ్రులు, కోచ్ కృషి ఎంతో ఉందని కాంస్యం నెగ్గిన అనంతరం కుశాలె కూడా చెప్పాడు.
విజేతకు మోదీ ఫోన్
షూటింగ్‌లో కాంస్యం సాధించిన స్వప్నిల్ కుశాలెతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడి అభినందించారు. అలాగే సోషల్ మీడియాలోనూ అతడి ఘనతను కొనియాడారు. ‘కుశాలె నుంచి అత్యద్భుత ప్రదర్శన. పురుషుల 50మీ. రైఫిల్3 పొజిషన్స్‌లో కాంస్యం సాధించినందుకు అభినందనలు. ఈక్రమంలో తను గొప్ప నైపుణ్యం, స్థితిప్రజ్ఞత ప్రదర్శించాడు. తన గెలుపుతో ప్రతీ భారతీయుడి హృదయం ఆనందంతో నిండిపోయింది’
- ప్రధాని నరేంద్ర మోదీ
ప్రమోషన్ వచ్చేసింది
ఒలింపిక్స్ కాంస్యం షూటర్ కుశాలెకు ఎక్కడలేని గుర్తింపే కాకుండా ఉద్యోగంలో ప్రమోషన్‌ను కూడా తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సెంట్రల్ రైల్వేలో టీటీఈగా పనిచేస్తున్న కుశాలె.. ఇప్పుడు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎ్‌సడీ)గా మారనున్నట్టు సెంట్రల్ రైల్వే జీఎం రామ్‌కరణ్ యాదవ్ వెల్లడించాడు. 2015లో రైల్వే్‌సలో చేరిన కుశాలె గత కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం ఎంతగా ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదట.