Share News

Vinesh Phogat: 750 కేజీల లడ్డులతో.. వినేశ్ ఫొగాట్‌కు అపూర్వ స్వాగతం

ABN , Publish Date - Aug 18 , 2024 | 05:07 PM

కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువుందనే కారణంతో ఒలింపిక్(Paris Olympics 2024) రెజ్లింగ్ పోటీల్లోంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat)ని తొలగించిన విషయం తెలిసిందే.

Vinesh Phogat: 750 కేజీల లడ్డులతో.. వినేశ్ ఫొగాట్‌కు అపూర్వ స్వాగతం

ఇంటర్నెట్ డెస్క్: కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువుందనే కారణంతో ఒలింపిక్(Paris Olympics 2024) రెజ్లింగ్ పోటీల్లోంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat)ని తొలగించిన విషయం తెలిసిందే. కాస్ కూడా అనుకూల తీర్పు ఇవ్వకపోవడంతో స్వదేశానికి పయనమైన వినేశ్ ఆదివారం తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన అనంతరం ఆమె హరియాణా చర్కీ దాద్రీ జిల్లా బలాలికి బయల్దేరారు. ఢిల్లీ నుంచి బలాలికి చేరుకోవడానికి సుమారు 10 గంటల సమయం పట్టింది. గ్రామానికి చేరుకున్న అనంతరం వినేశ్‌కి గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు.

ఆమెకు ప్రైజ్‌మనీ ఇచ్చారు. ఓ వాచ్‌మెన్ కూడా వినేశ్ కోసం రూ.100 ఇచ్చాడు. గ్రామస్థులంతా కలిసి రూ.21 వేలు ఆమెకు బహుమతిగా అందజేశారు. ఇది పెద్ద మొత్తం కాకపోయినా.. వారి ప్రేమాభిమానాలపట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైజ్‌మనీతోపాటు 750 కిలోల లడ్డూలనూ ఆమెకు అందజేశారు. వాటిని ఊరంతా పంచారు. గ్రామస్థుల అభిమానం, ప్రేమపట్ల వినేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. అంతకుముందే ఆమెకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. అనంతరం నిర్వహించిన ర్యాలీలో రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులు పాల్గొన్నారు.


దేశ ప్రజలకు కృతజ్ఞతలు...

విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆమె మీడియాతో భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు అని విమానాశ్రయంలో తనను స్వాగతించిన వారినుద్దేశించి వినేశ్‌ అంది. అక్కడినుంచి ఓపెన్‌ టాప్‌ జీపులో ర్యాలీగా బయలుదేరింది. 100 గ్రాముల అధిక బరువుందనే కారణంతో పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కిలోల ఫైనల్‌నుంచి వినేశ్‌ను అనర్హురాలిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్వాహకుల నిర్ణయాన్ని ఆమె క్రీడా మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో సవాలు చేస్తూ తనకు రజత పతకం ప్రకటించాలని కోరింది. దానిపై విచారణ, తీర్పు తదితరాల నేపథ్యంలో పారిస్‌ నుంచి వినేశ్‌ రాక ఆలస్యమైంది.


విమానాశ్రయం నుంచి తన అభిమానులు పలు వాహనాల్లో వెంటరాగా హరియాణాలోని స్వస్థలం బలాలీకి వినేశ్‌ బయలుదేరింది. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో గల ఓ ఆలయంలో వినేశ్‌ పూజలు నిర్వహించింది. మార్గమధ్యంలోపలు ప్రాంతాల్లో తనకోసం వేచివున్న మద్దతుదారులను ఆమె కలుసుకుంది. ఢిల్లీ సమీపంలోని బద్లీ గ్రామ వాసులు వినేశ్‌కు అపూర్వ స్వాగతం పలికారు. అది చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైన వినేశ్‌ కంటతడి పెట్టుకుంది. ఈ సందర్భంగా భర్త సోమ్‌వీర్‌.. వినేశ్‌ను ఓదార్చాడు. ‘పారిస్‌ క్రీడల నిర్వాహకులు నాకు బంగారు పతకం ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ మీరు నాపట్ల చూపుతున్న ప్రేమ, అభిమానం వేయి ఒలింపిక్‌ స్వర్ణ పతకాలకు మించినది’ అని ఆమె భావోద్వేగం చెప్పారు.

Updated Date - Aug 18 , 2024 | 05:29 PM