Share News

Rishabh Pant: ఇన్‌స్టాగ్రామ్‌లో అంతుచిక్కని పోస్ట్ పెట్టిన రిషబ్ పంత్

ABN , Publish Date - Oct 20 , 2024 | 10:01 PM

బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ నిగూడార్థంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. ‘‘కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమం. దేవుడే చూసుకుంటాడు’’ అని రాసుకొచ్చాడు.

Rishabh Pant: ఇన్‌స్టాగ్రామ్‌లో అంతుచిక్కని పోస్ట్ పెట్టిన రిషబ్ పంత్
Rishab Pant

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ గాయపడ్డ విషయం తెలిసిందే. మోకాలికి సర్జరీ జరిగిన ప్రదేశంలోనే బంతి తగలడంతో వాపు వచ్చింది. దీంతో అతడు ఆట 2వ రోజున మైదానం వీడాడు. దీంతో ధృవ్ జురెల్ వచ్చి కీపింగ్ చేశాడు. ఇక ఆట నాలుగవ రోజు బ్యాటింగ్‌కు దిగిన పంత్ అదరగొట్టాడు. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీని కోల్పోయాడు. అయితే బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం రిషబ్ పంత్ తన ఉద్దేశం ఏంటో అర్థంకాని ఒక నిగూడార్థంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. ‘‘కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండడమే ఉత్తమం. దేవుడే చూసుకుంటాడు’’ అని రాసుకొచ్చాడు.


న్యూజిలాండ్ చేతిలో ఓటమి అనంతరం పంత్ పెట్టిన ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. మరోవైపు బెంగళూరు టెస్టులో టీమిండియా మద్దతు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఎక్స్ వేదికగా రిషబ్ పంత్ మరో పోస్ట్ పెట్టాడు. ఈ సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో భారత జట్టు తిరిగి పుంజుకుంటుందని అభిమానులకు హామీ ఇచ్చాడు.

‘‘ఈ ఆట పరిమితులను పరీక్షిస్తుంది. పడగొడుతుంది, పైకి లేపుతుంది. మళ్లీ వెనక్కి విసిరేస్తుంది. కానీ ఈ ఆటను ఇష్టపడేవారు ప్రతిసారీ బలవంతులుగా మారతారు. అద్భుత రీతిలో ప్రేమాభిమానాలతో మద్దతు తెలిపిన బెంగళూరు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మేము తిరిగి బలంగా పుంజుకుంటాం’’ అని ఎక్స్ పోస్టులో పంత్ పేర్కొన్నాడు.


కాగా బెంగళూరు టెస్టులో పర్యాటక జట్టు న్యూజిలాండ్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత్‌ గడ్డపై కివీస్ తొలి విజయాన్ని అందుకుంది. చివరిసారిగా 1988లో భారత్ గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి కావడం గమనార్హం. భారత గడ్డపై న్యూజిలాండ్ మొత్తం 37 టెస్టు మ్యాచ్‌లు ఆడగా ఇది మూడవ విజయం. ఇక 2000 తర్వాత భారత్‌లో టెస్ట్ మ్యాచ్ నాలుగవ ఇన్నింగ్స్‌లో 100 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన తొలి పర్యాటక జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇక భారత్-న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 24 నుంచి పుణెలో రెండవ టెస్టు మొదలు కానుంది. చివరిదైన మూడవ టెస్టు నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా షురూ కానుంది.

Updated Date - Oct 20 , 2024 | 10:04 PM