ENG vs WI: ఫీల్డింగ్ విషయంలో గొడవ.. మైదానంలోనే పరువు తీసుకున్న ఆటగాళ్లు
ABN , Publish Date - Nov 07 , 2024 | 03:56 PM
ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ విషయంలో కెప్టెన్ క ప్లేయర్ కు మధ్య చోటుచేసుకున్న వివాదం వెస్టిండీస్ జట్టు పరువు తీసింది.
కెన్సింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన 3వ వన్డే సందర్భంగా వెస్టిండీస్ ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మ్యాచ్ కీలక ఓవర్ లో ఆ జట్టు బౌలర్ మైదానం నుంచి వాకౌట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బుధవారం కెన్సింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన 3వ వన్డేలో వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్.. కెప్టెన్ షాయ్ హోప్‌తో మైదానంలోనే గొడవపడ్డాడు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌పై తీవ్ర వాగ్వాదం జరగడంతో జోసెఫ్ మైదానాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న అభిమానులు షాక్ కు గురయ్యారు. ఒక వికెట్-మెయిడెన్ బౌలింగ్ చేసినప్పటికీ, జట్టు కెప్టెన్ ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లతో జోసెఫ్ సంతోషంగా లేడు. కెప్టెన్ మీద కోపంతో జోసెఫ్ ఇలా మైదానం వదిలి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఫీల్డింగ్‌ను సెట్ చేసే విషయంలో కెప్టెన్ నిర్ణయాలను జోసెఫ్ తప్పుపట్టాడు.
అలా మ్యాచ్ మధ్యలో మైదానం విడిచిన అతడు ఓ ఓవర్ పాటు నిరసన వ్యక్తం చేశాడు. ఆ సమయంలో పది మంది ఆటగాళ్లు మాత్రమే విండీస్‌కు ఫీల్డింగ్ చేశారు. ఒక ఓవర్ తర్వాత జోసెఫ్ మళ్లీ మైదానంలోకి దిగి జట్టుతో చేరాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అదే సమయంలో, బ్రాండన్ కింగ్, కీసీ కార్టీ సెంచరీలతో విజృంభించడంతో వెస్టిండీస్ ఈ నిర్ణయాత్మక గేమ్‌లో ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.