ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో 10 మందిపై కేసు
ABN , Publish Date - Jul 03 , 2024 | 05:19 AM
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు మంగళవారం పదిమందిపై కేసు నమోదు చేశారు.
భూ వివాదంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
మనస్తాపంతో పొలంలోనే బలవన్మరణానికి పాల్పడ్డ రైతు ప్రభాకర్
చనిపోతూ వీడియో.. రాష్ట్రవ్యాప్తంగా చర్చ.. దర్యాప్తునకు సీఎం ఆదేశం
చెరువు పక్కన ఉన్న తన వ్యవసాయ భూమిలో మట్టి పోయించుకొన్న ప్రభాకర్
అది చెరువు శిఖం అని అభ్యంతరాలు
మత్స్యసంఘానికి, ప్రభాకర్ కుటుంబానికి మధ్య వివాదం
తన పొలంలో గుంతలు తవ్వారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతు ప్రభాకర్ మనస్తాపం
చింతకాని/ఖమ్మం, జూలై 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులు మంగళవారం పదిమందిపై కేసు నమోదు చేశారు. పొద్దుటూరు గ్రామ రెవెన్యూ పరిధిలో 276, 277 సర్వే నెంబర్‌లో పాము చెరువుకు సమీపంలో ప్రభాకర్, ఆయన కుటుంబ సభ్యులకు 7.10 ఎకరాల భూమి ఉంది. ప్రభాకర్ ఈ వేసవిలో తన భూమిలో చెరువు మట్టి పోయించుకున్నాడు.
అయితే, ప్రభాకర్ చెరువు శిఖం భూమిలో మట్టి పోయించి సాగు చేస్తున్నాడంటూ మత్స్యసంఘం సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయంపై కొన్ని రోజులుగా ప్రభాకర్ కుటుంబానికి, మత్య్ససంఘ సభ్యులకు వివాదం నడుస్తోంది.
తాను మట్టి పోసిన భూమిలో మత్స్య సంఘం సభ్యులు ప్రొక్లెయిన్లతో పెద్ద గుంతలు తవ్వారని మనస్థాపం చెందిన ప్రభాకర్.. తన పొలాన్ని కొందరు నాశనం చేశారని, వారిపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని తన పొలంలోనే పురుగుల మందు తాగుతూ వీడియో తీసి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి తండ్రి వీరభద్రం ఫిర్యాదు మేరకు పదిమందిపై ఖమ్మం నగరం ఖానాపురంహవేలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభాకర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి పొద్దుటూరుకు తరలించగా పోలీసుల పర్యవేక్షణలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
వీడియో వైరల్.. రాష్ట్రవ్యాప్తంగా చర్చ
రైతు ప్రభాకర్ పురుగుల మందు తాగుతున్న వీడియో వైరల్ అయింది. అతని ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఘటనపై స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్పందించడంతో కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ప్రభాకర్ ఆత్మహత్యపై పూర్తి విచారణ జరపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. కాగా ఆత్మహత్యకు ముందు రైతు చిత్రీకరించింది సెల్ఫీ వీడియో కాదని, మరో వ్యక్తి వీడియో తీస్తుండగా రైతు మాట్లాడినట్లు ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగిన ఆధారాలు కూడా పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం. పోలీసులు అనుమానిస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తరువాత స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, అతడు పరారీలో ఉండటం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నాయి.
పక్కనే మరో ముగ్గురు
ప్రభాకర్ ఆత్మహత్యకు వీడియో రికార్డు చేసిన సమయంలో అక్కడ అతడితో పాటు మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. రైతు ప్రభాకర్ మాట్లాడుతుండగా ఓ యువకుడు వీడియో రికార్డు చేయగా అతడు రికార్డు చేస్తున్న దృశ్యాలను ఆదే ప్రాంతంలో ఉన్న మరో యువకుడు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ వీడియో పోలీసుల వద్ద ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రైతు ప్రభాకర్ అసలు ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఇంకేమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా రైతు ప్రభాకర్ పురుగుల మందు తాగిన మామిడి తోటను ఖమ్మం అర్బన్ పోలీసులు మంగళవారం సాయంత్రం పరిశీలించినట్లు తెలిసింది.