Narayanakhed: బీసీ గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Nov 09 , 2024 | 03:37 AM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకులానికి చెందిన 12 మంది విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు.
12 మందికి వాంతులు, విరేచనాలు
నారాయణఖేడ్ మహాత్మా జ్యోతి బాఫూలే పాఠశాలలో ఘటన
నారాయణఖేడ్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకులానికి చెందిన 12 మంది విద్యార్థులు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. స్వల్పంగా అస్వస్థతకు గురైన వారికి సిబ్బంది మందులను అందజేశారు.
గురుకులంలో ఉన్న నీటిశుద్ధి ప్లాంటు పాడైపోవడంతో కొన్ని నెలలుగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. పైప్‌లైన్ లీకేజీతో నీరు కలుషితమౌతోందని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వాపోతున్నారు. రెండు నెలల క్రితం గురుకులాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్లాంట్‌కు మరమ్మతులు చేయించాలని సిబ్బందిని ఆదేశించానా ఆ దిశగా చర్యలు కరువయ్యాయని స్థానికులు ఆరోపించారు.