Land Fraud: మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు
ABN , Publish Date - Nov 15 , 2024 | 04:34 AM
మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన వద్ద భూమిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని 87 ఏళ్ల బాధితుడు కళ్లెం నర్సింహారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నా భూమి కొని డబ్బులివ్వడం లేదు
న్యాయం చేయండి : సీఎంకు బాధితుడి వినతి
బర్కత్‌పుర, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన వద్ద భూమిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని 87 ఏళ్ల బాధితుడు కళ్లెం నర్సింహారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... శామీర్‌పేట మండలం యాడారంలో సర్వే నం. 249, 250ఏ లోని తనకు చెందిన 9ఎకరాల 29 గుంటల భూమిని రూ.21.88 కోట్లకు కొనుగోలు చేయడానికి చామకూర మల్లారెడ్డి రూ.8.3 కోట్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత రూ.14 కోట్లకు చెక్కు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, తీరా అది బౌన్స్ అయిందని వాపోయారు. చెక్కు బౌన్స్ కావడంతో తనకు డబ్బులు ఇవ్వాలని 40 రోజులుగా అడుగుతుంటే వేధింపులకు గురి చేయడమే కాకుండా, కేసులు బనాయిస్తానని బెదిరిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని, మాజీ మంత్రి మల్లారెడ్డి నుంచి డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు.