Share News

Nursing Recruitment: జాబ్‌ ఉన్నోళ్లే మళ్లీ రాశారు!

ABN , Publish Date - Nov 24 , 2024 | 04:09 AM

నర్సింగ్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 95.69 శాతం మంది హాజరైనట్లు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది.

Nursing Recruitment: జాబ్‌ ఉన్నోళ్లే మళ్లీ రాశారు!

  • కఠినంగా నర్సింగ్‌ పరీక్ష.. 95.69 శాతం హాజరు

  • మళ్లీ రాసిన 1500 మంది రెగ్యులర్‌ నర్సులు

  • వారిని పక్కన పెట్టాలి నిరుద్యోగ అభ్యర్థుల డిమాండ్‌

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నర్సింగ్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 95.69 శాతం మంది హాజరైనట్లు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. మొత్తం 2322 స్టాఫ్‌నర్సు పోస్టులకు గాను 42244 మంది దరఖాస్తు చేయగా...అందులో 40423 మంది పరీక్షకు హాజరైనట్లు బోర్డు కార్యదర్శి గోపికాంత్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష కీ పేపరు సోమ, మంగళవారాల్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా, రెండు సెషన్లలో జరిగిన ఈ పరీక్ష పేపర్స్‌ చాలా కఠినంగా వచ్చినట్లు నర్సింగ్‌ అభ్యర్ధులు చెబుతున్నారు. కాగా, ఒకటి రెండు కేంద్రాలో సాంకేతిక సమస్య కారణంగా పది నిమిషాలు ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైనట్లు వైద్యవర్గాలు తెలిపాయి. కాగా, ఈసారి స్టాఫ్‌నర్సు పోస్టులకు గట్టి పోటీ నెలకొంది. ఒక్కొ పోస్టుకు సగటున 17 మంది పోటీ పడ్డారు. దీంతో ఈసారి జాబ్‌ చేస్తున్న స్టాఫ్‌నర్సులు కూడా ఈ పరీక్షకు హాజరైనట్లు నిరుద్యోగ అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 మంది వరకు రెగ్యులర్‌ నర్సులు శనివారం జరిగిన పరీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది.


వీరిలో ఎక్కువగా గురుకులాల్లో పనిచేస్తున్నవారు ఉన్నట్లు సమాచారం. అంతేకాక జీవో నం. 317 కింద సొంత జిల్లాలకు కాకుండా, ఇతర జిల్లాలకు బదిలీ అయిన స్టాఫ్‌నర్సులు కూడా కొందరు ఈ పరీక్ష రాసిన వారిలో ఉన్నారని అంటున్నారు. అలాగే తమకు నచ్చని చోట పోస్టింగులు పొందిన మరికొందరు నర్సులు కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. అంతేకాకుండా దరఖాస్తుల్లో వెయిటేజ్‌ అభ్యర్ధులుగా నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ సెలక్షన్‌ జాబితా విడుదల సమయంలో స్కూృట్నీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక రెగ్యులర్‌ నర్స్‌లలో మెజార్టీ అభ్యర్థులు తమ విభాగాధిపతుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోకుండానే పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. ఇది కూడా నిబంధనలకు పూర్తి విరు ద్ధం. ఎన్‌వోసీ లేనివారు ఒక వేళ ఉద్యోగానికి ఎంపికైతే వారి నియామకాన్ని పక్కనపెట్టాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 24 , 2024 | 04:09 AM