Share News

Shiva Balakrishna: ఆదాయంతో పోలిస్తే శివబాలకృష్ణ ఆస్తులు 350%

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:36 AM

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ కేసు కీలక దశకు చేరుకుంది. డ్రాఫ్ట్‌ చార్జిషీట్‌ సిద్ధం చేసిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు.

Shiva Balakrishna: ఆదాయంతో పోలిస్తే శివబాలకృష్ణ ఆస్తులు 350%

  • 214 ఆస్తుల్ని అటాచ్‌ చేసిన ఏసీబీ.. కీలక దశకు గొర్రెల కేసు

  • రెండు కేసుల్లోనూ డ్రాఫ్ట్‌ చార్జిషీట్‌ సిద్ధం

  • అవినీతి కేసుల్లో ప్రతి 48 గంటలకు ఒకరి పట్టివేత!

  • 8 నెలల్లో 145 కేసులు.. టాప్‌-3లో రెవెన్యూ, హోం, మునిసిపల్‌

  • ఐఏఎస్‌, ఐపీఎస్‌లపైనా ఫిర్యాదులు.. వెల్లడిస్తున్న ఏసీబీ గణాంకాలు

  • 214 ఆస్తులను అటాచ్‌ చేసిన ఏసీబీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ కేసు కీలక దశకు చేరుకుంది. డ్రాఫ్ట్‌ చార్జిషీట్‌ సిద్ధం చేసిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు.. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు నిర్ధారించారు. అతని ఆదాయంతో పోలిస్తే.. ఆస్తుల విలువ 350ు అధికంగా ఉన్నట్లు నిగ్గుతేల్చారు. ఈ కేసులో 214 ఆస్తులను అటాచ్‌ చేశారు. విచారణలో శివబాలకృష్ణ వెల్లడించిన కొందరు అధికారులను కూడా విచారించేందుకు ఏసీబీ సిద్ధమైంది. మరోవైపు గొర్రెల కొనుగోళ్లలో అక్రమాల కేసులోనూ ఏసీబీ డ్రాఫ్ట్‌ చార్జిషీట్‌ను సిద్ధం చేసింది.


  • టాప్‌-3 శాఖలివే..!

గడిచిన ఎనిమిది నెలల్లో సగటున 48 గంటలకు ఒకరు చొప్పున ప్రభుత్వోద్యోగులు ఏసీబీకి చిక్కారు. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ 8 నెలల్లో అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి.. గత నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 145 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 109 మంది అరెస్టయ్యారు. వీరిలో 85 మంది ప్రభుత్వోద్యోగులు, 24 మంది ప్రైవేటు వ్యక్తులు. సీవీ ఆనంద్‌ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నమోదైన కేసులు ఇవి..! అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి కేసుల పరంగా చూస్తే.. రెవెన్యూ, హోంశాఖ, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 145 కేసుల్లో దాదాపు సగం(71) ఈ శాఖలకు సంబంధించినవే. రవాణా, పంచాయతీరాజ్‌ శాఖలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు ఏసీబీ గణాంకాలు చెబుతున్నాయి. ఇక అవినీతి అధికారులపై విచారణకు ప్రభుత్వ అనుమతి కోరిన 229 మంది(148 కేసులు) ఉద్యోగుల విషయంలో సర్కారు ఇంకా అనుమతించాల్సి ఉంది. 72 కేసుల్లో మాత్రం 86 మందిపై విచారణకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఈ ఏడాది 10 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారు కాగా.. శిక్షల శాతం 55.55శాతంగా ఉంది.


  • ఐఏఎస్‌, ఐపీఎ్‌సలపైనా ఫిర్యాదులు..!

ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబరు 1064కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. సాధారణ అధికారులతోపాటు ఐఏఎస్‌, ఐపీఎ్‌సల అవినీతిపై కూడా ఏసీబీకి ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - Sep 09 , 2024 | 04:36 AM