ప్రారంభమైన వరి కోతలు
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:17 PM
వానా కాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వరికోతలు ప్రారంభించక ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించా లని భావించినా ఆచరణలో అమలు కావడంలేదు. ఫలితంగా కోతలు పూర్తయి పంట చేతికి వచ్చిన రైతులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
మంచిర్యాల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): వానా కాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. వరికోతలు ప్రారంభించక ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించా లని భావించినా ఆచరణలో అమలు కావడంలేదు. ఫలితంగా కోతలు పూర్తయి పంట చేతికి వచ్చిన రైతులు ప్రైవేటు మార్కెట్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. 17 శాతం తేమ ఉండాల్సి ఉండగా, గరి ష్టంగా 40 శాతం మేర ఉండటమే ఽధాన్యం సేకరించక పోవడానికి కారణమని సివిల్ సప్లయిస్ అధికారులు చెబుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ధాన్యం ఆరబెట్టేందుకు అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా పంట వేసిన నాటి నుంచి చేతికొచ్చే వరకు, చివరికి పంటను అమ్ముకునే సమయంలోనూ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు అంతంత మాత్రమే ఉండటం కూడా రైతుల పాలిట శాపంగా మారుతోంది.
కొనుగోలు లక్ష్యం ఘనం
ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 326 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 3,29,983 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 136 కేం ద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 129, మెప్మా ఆధ్వర్యంలో 10, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 51 కేంద్రాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే నేటి వరకు కేవలం 140 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. వరి కోతలు ఊపందుకోవడంతో కలెక్టర్ కుమార్‌దీపక్ రెండు రోజులుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తు న్నారు. ఇప్పటి వరకు ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో 122, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 15, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 3 సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు అంతంత మాత్రమే
ప్రతీ సీజన్‌లోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. ధాన్యాన్ని ఆరబోసేందుకు స్థలం లేకపోవడంతో తేమ సమస్యను ఎదుర్కొంటు న్నారు. తేమ శాతం సాకుగా చూపి నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడం లోనూ రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రైస్ మిల్లులకు తీసుకువెళ్లిన తర్వాత మిల్లర్లు ధాన్యం సరిగా లేదని తీసుకోవడానికి కొర్రీలు పెడుతున్నారు. అడుగడు గునా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలను తొలగించే విషయంపై ఈ సీజన్‌లోలైనా ి అధికారులు ధృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
సన్నాలకు బోనస్ అందేనా...?
సన్నరకాలకు రూ.500 బోనస్ చెల్లింపులపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ యేడాది కేంద్రం ప్రకటిం చిన మద్దతు ధర ప్రకారం ఏ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ.2320, సాధారణ రకానికి రూ.2300 ఉన్నాయి. సన్న రకాలకు అదనంగా బోనస్ క్వింటాలుకు రూ.500 చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేనికారణంగా రైతుల్లో సందేహాలు వ్యక్తమవుతు న్నాయి.
తీరని గోనె సంచుల కొరత...!
గోనె సంచులు, లారీల సమస్య ప్రతీ సారీ వేధిస్తూనే ఉంది. ధాన్యం కొనుగోళ్లకు సంచుల కొరత లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఈ సమస్య తీవ్రంగానే ఉంది. వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు 82.49 లక్షల గోనె సంచులు అవసరం కాగా, ప్రస్తుతం 50 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 32.49 లక్షల సంచులను సేకరించాల్సి ఉండగా కోతలు ప్రారంభమైనా గోనె సంచులు జిల్లాకు చేరలేదు. అకాల వర్షాల కారణంగా కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ఉండేందుకు లారీల కొరత తీర్చడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో ఐదుగురు చొప్పున సిబ్బందిని నియమించాలని రైతులు కోరుతున్నారు.