Share News

AIIMS: సామాజిక సవాల్‌గా మూర్ఛ వ్యాధి

ABN , Publish Date - Nov 18 , 2024 | 03:03 AM

మూర్ఛ వ్యాధి ఒక సామాజిక సవాలుగా మారిందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డీ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. మూర్ఛకు అత్యుత్తమ చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

AIIMS: సామాజిక సవాల్‌గా మూర్ఛ వ్యాధి

  • ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి.. ఏఐజీలో ‘సెంటర్‌ ఫర్‌ ఎపిలెప్సీ’ ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మూర్ఛ వ్యాధి ఒక సామాజిక సవాలుగా మారిందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ డీ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. మూర్ఛకు అత్యుత్తమ చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జాతీయ మూర్ఛ వ్యాధి దినం సందర్భంగా ఆదివారం ఏఐజీ ఆస్పత్రిలో ‘సెంటర్‌ ఫర్‌ ఎపిలెప్సీ’ని ప్రారంభించారు. వివిధ వైద్య విభాగాల నిపుణులు ఒకేచోట ఉండి మూర్ఛ రోగులకు చికిత్స అందించేందుకు వీలుగా ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ మూర్ఛ రోగుల్లో చాలామందికి చికిత్సపై అవగాహన ఉండడం లేదన్నారు. దాంతో 70 నుంచి 80శాతం కేసుల్లో చికిత్సతో నయం చేసే అవకాశం ఉన్నా చాలామంది రోగులు మూర్ఛతో బాధపడుతూనే జీవిస్తున్నారన్నారు.


ఇది సామాజిక ఒంటరితనానికి, ఉత్పాదకత కోల్పోవడానికి దారితీస్తుందని, జీవిత నాణ్యతను దెబ్బతీస్తుందన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మూర్ఛ రోగులు సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం లేదన్నారు. మూర్ఛ గురించి అపోహలను తొలగించడానికి, సకాలంలో చికిత్స పొందేలా ప్రోత్సహించడానికి ‘సెంటర్‌ ఫర్‌ ఎపిలెప్సీ’ కృషి చేస్తుందని ఏఐజీ ఆస్పత్రి న్యూరాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ఎ జబీన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథిగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ, డాక్టర్లు మల్లా భాస్కరరావు (బెంగళూరు నిమ్హాన్స్‌ ఆస్పత్రి), దినేష్‌ నాయక్‌ (చెన్నై గ్లోబల్‌ ఆస్పత్రి), రమేష్‌ దొడ్డమణి (ఢిల్లీ ఎఐఐఎంఎస్‌), ఏఐజీ వైస్‌ చైర్మన్‌ పీవీఎస్‌ రాజు, డైరెక్టర్‌ డాక్టర్‌ జీవీ రావు, డాక్టర్‌ సుబోధ్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 03:03 AM