Pushpa 2: 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
ABN , Publish Date - Dec 14 , 2024 | 03:25 AM
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టు అయిన అల్లు అర్జున్‌ను 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపాలని గురువారం నాంపల్లి కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టు అయిన అల్లు అర్జున్‌ను 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపాలని గురువారం నాంపల్లి కోర్టు ఆదేశించింది. తొలుత గాంధీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల సమయంలో నాంపల్లిలోని 9వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో పోలీసులు ఆయన్ను ప్రవేశపెట్టారు. గంటన్నరకు పైగా ప్రభుత్వ న్యాయవాదికి, అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డికి మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. భారీ సంఖ్యలో అభిమానులున్న అల్లు అర్జున్ ప్రజల్లోకి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ‘అర్జున్ సంధ్య థియేటర్‌కు సినిమా చూడడానికి వచ్చినపుడు పోలీసుల నుంచి అనుమతులు తీసుకోలేదు. ముందస్తు ఏర్పాట్లు కూడా చేసుకోలేదు. పైపెచ్చు ముందస్తు అనుమతి లేకుండా రోడ్‌షో చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఆయనను చూడడానికి నెట్టుకోవడం ప్రారంభించారు. అభిమానులు ఆయనతోపాటే సంధ్య థియేటర్‌లోకి చొచ్చుకువచ్చారు. ఆయనకు భద్రత కల్పించేందుకు బౌన్సర్లు అభిమానులను ఇష్టానుసారం నెట్టేయడంతో తొక్కిసలాట జరిగింది. తన భద్రతకు కోసం బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్న అర్జున్, ప్రజల భద్రత గురించి కూడా అదే తరహాలో ఆలోచిస్తే ఈ ప్రమాదం జరిగేది కాదు’’ అని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న విధంగా సెక్షన్ 105 (నాన్ బెయిలబుల్), సెక్షన్ 118(1), రెడ్ విత్ 3(5), బీఎన్‌ఎ్‌స సెక్షన్ల కింద అర్జున్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరారు.
పోలీసుల వైఫల్యమే!
‘పుష్ప2’ సినిమా నిర్మాతలు ప్రభుత్వం నుంచి ముందే ప్రీమియర్ షోలకు అనుమతి తీసుకున్నారని, ఈ చిత్రానికున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని అభిమానుల తాకిడిని అంచనా వేసి తగు ఏర్పాట్లు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి వాదించారు. పోలీసుల సమక్షంలోనే జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జున్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సబబు కాదన్నారు. పోలీసుల అజాగ్రత్త కూడా ఇందులో ఉందని, ఫిర్యాదుదారుడు తన భార్య ఊపిరాడక చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు కానీ ఎవరినీ బాధ్యులు చేయలేదని ప్రస్తావించారు. ఈ సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది.