Secunderabad: సెయింట్ మేరీస్ చర్చిలో మాజీ బిషప్ తుమ్మబాల ఖననం
ABN , Publish Date - Jun 01 , 2024 | 05:22 AM
అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన హైదరాబాద్ ఆర్చి డయోసిస్ మాజీ బిషప్ తుమ్మబాల పార్థివ దేహాన్ని సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ బసలిక చర్చిలో ఖననం చేశారు. తుమ్మబాల పోప్ సెయింట్ జాన్‌పాల్ 2 ద్వారా 1986 నవంబరులో వరంగల్ రెండో బిష్‌పగా నియమితులై 25 ఏళ్లు బిష్‌పగా పనిచేశారు.
నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రెజిమెంటల్ బజార్, మే 31 (ఆంరఽధజ్యోతి): అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన హైదరాబాద్ ఆర్చి డయోసిస్ మాజీ బిషప్ తుమ్మబాల పార్థివ దేహాన్ని సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ బసలిక చర్చిలో ఖననం చేశారు. తుమ్మబాల పోప్ సెయింట్ జాన్‌పాల్ 2 ద్వారా 1986 నవంబరులో వరంగల్ రెండో బిష్‌పగా నియమితులై 25 ఏళ్లు బిష్‌పగా పనిచేశారు. అనంతరం హై దరాబాద్ ఆర్చ్ బిష్‌పగా 2011 నుంచి 2020 వరకు సేవలు అందించి పదవీ విరమణ పొందారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని దివ్యజ్యోతి నిలయంలో ఉంటూ అనారోగ్యంతో గురువారం తుదిశ్వాస విడిచారు.
దీంతో ఆయన పార్థివ దేహాన్ని సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చికి తరలించి రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం ప్రజల సందర్శనార్థం సెయింట్ మేరీస్ పాఠశాల ఆవరణలో ఉంచారు. కార్డినల్ పూల ఆంథోని ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం సెయింట్ మేరీస్ బసలిక చర్చికి పార్థివ దేహాన్ని తరలించి చర్చి లోపల ఖననం చేశారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ పాఠశాల ఆవరణలో ఉంచిన తుమ్మబాల పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ... సమాజ నిర్మాణంలో ఆయన ఎనలేని సేవలు అందించారని అన్నారు.