Share News

Asifabad : శిశు విహార్‌ కేంద్రంలో కలెక్టర్‌ కుమార్తె

ABN , Publish Date - Aug 28 , 2024 | 04:18 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిశు విహార్‌ కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే... మంగళవారం తన కూతురు స్వర ధోత్రే(3)ను చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

Asifabad : శిశు విహార్‌ కేంద్రంలో కలెక్టర్‌ కుమార్తె

  • కుమ్రంభీం జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్‌ ఆదర్శం

  • శిశు విహార్‌ కేంద్రంలో చేరిన కలెక్టర్‌ కూతురు

ఆసిఫాబాద్‌రూరల్‌, అగస్టు 27: కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిశు విహార్‌ కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే... మంగళవారం తన కూతురు స్వర ధోత్రే(3)ను చేర్పించి ఆదర్శంగా నిలిచారు. మిషన్‌ శక్తి పాలన పథకంలో భాగంగా శిశు విహార్‌ కేంద్రాన్ని సమీకృత కలెక్టర్‌ భవన సముదాయంలో జూన్‌లో ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల సంరక్షణతో పాటు పోషకాహారాన్ని అందిస్తారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేసిన శిశువిహార్‌ కేంద్రాల్లో ఆసిఫాబాద్‌ శిశు విహార్‌ మూడోది. ఇప్పటికే హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... తన కూతురు శిశు విహార్‌ కేంద్రంలో చదువుకోవడం సంతోషంగా ఉందన్నారు. శిశు విహార్‌లో ఒకటి నుంచి ఐదేళ్ల లోపు వయస్సు గల పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటారని, సమయానికి పోషకాహారం అందిస్తారని తెలిపారు. ఆటపాటలు బొమ్మలతో ప్రాథమిక విద్యను అందించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 04:18 AM