Share News

Bandi Sanjay: కేటీఆర్‌.. యాక్టింగ్‌ సీఎం

ABN , Publish Date - Nov 09 , 2024 | 04:41 AM

రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయితే.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ యాక్టింగ్‌ సీఎం అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: కేటీఆర్‌.. యాక్టింగ్‌ సీఎం

  • ఆయనదీ, రేవంత్‌దీ ఇచ్చిపుచ్చుకునే దోస్తీ

  • అది బెడిసికొట్టినప్పుడే కేటీఆర్‌ అరెస్టు

  • మీడియాతో బండి సంజయ్‌ చిట్‌చాట్‌

హైదరాబాద్‌/శంషాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయితే.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ యాక్టింగ్‌ సీఎం అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. రేవంత్‌, కేటీఆర్‌ ఒక్కటేనని.. వారిద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి సాగుతోందని చెప్పారు. అది బెడిసికొట్టినప్పుడే కేటీఆర్‌ అరెస్టు జరుగుతుంది తప్ప.. ఫార్ములా రేస్‌, రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌ కేసులు ఎన్ని వెలుగు చూసినా ఏమీ కాదని తేల్చిచెప్పారు. ఇటీవల జన్వాడ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో దొరికిన వారిని పోలీసులు వదలిపెట్టడం రాజీ రాజకీయం కాదా..? అని ప్రశ్నించారు. కూతురి పెళ్లికి కూడా అందుబాటులో లేకుండా చేసిన కేసీఆర్‌, కేటీఆర్‌లను అవినీతి కేసుల్లో అరెస్టు చేయకుండా రేవంత్‌ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని నిలదీశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. సంజయ్‌, రేవంత్‌ ఒక్కటే అంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యపై స్పందించారు.


రేవంత్‌ను, కాంగ్రె్‌సను ఎక్కువ విమర్శించేది తానేనని సంజయ్‌ తెలిపారు. కేటీఆర్‌, రేవంత్‌ ఒక్కటే అన్నదానికి వంద ఉదాహరణలు చెబుతానని.. తాను రేవంత్‌ ఒక్కటే అన్నదానికి కేటీఆర్‌ ఒక్క ఉదాహరణయినా చెప్పాలని డిమాండ్‌చేశారు. అరెస్టు భయంతో కేటీఆర్‌ మలేషియా వెళ్లడం ఎంత నిజమో.. రాజ్‌భవన్‌ కేంద్రంగా బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటి కావడం అంతే నిజమని సంజయ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని ఉద్దేశించి అంత సంస్కారహీనంగా మాట్లాడతారా? అని కేటీఆర్‌పై మండిపడ్డారు. కేటీఆర్‌తో పోలిస్తే హరీశ్‌ పట్ల ప్రజల్లో కొంత విశ్వసనీయత ఉందన్నారు. గవర్నర్‌కు కూడా ప్రొటోకాల్‌ ఇవ్వని మూర్ఖ ప్రభుత్వం బీఆర్‌ఎ్‌సదని విమర్శించారు. రాజ్‌భవన్‌ను కూడా రాజకీయం చేస్తారా? అని మండిపడ్డారు. శంషాబాద్‌ మునిసిపాలిటీ పరిధి ఎయిర్‌పోర్టు నిర్వాసితుల కాలనీలోని హనుమాన్‌ ఆలయంలో నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసి మూడు రోజులైనా పోలీసులు చర్యలు తీసుకోలేదని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని సంజయ్‌ ధ్వజమెత్తారు.


  • రాహుల్‌ బీసీలకు క్షమాపణ చెప్పాలి: లక్ష్మణ్‌

కాంగ్రెస్‌ చారిత్రక తప్పిదాల వల్ల దేశ వ్యాప్తంగా బీసీలు అన్యాయానికి గురయ్యారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇందిర హయాంలో అసలు బీసీ కమిషనే ఏర్పాటు చేయలేదని, మండల్‌ కమిషన్‌ సిఫారసులను రాజీవ్‌ వ్యతిరేకించారని పేర్కొన్నారు. రాహుల్‌ ముందు బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీలను ప్రలోభపెట్టేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం కుల గణనను తెరమీదకు తెచ్చిందని విమర్శించారు.

Updated Date - Nov 09 , 2024 | 04:41 AM