Share News

20 వేల మెగావాట్ల గ్రీన్‌ పవర్‌ను ఉత్పత్తి చేస్తాం

ABN , Publish Date - Oct 14 , 2024 | 04:57 AM

రానున్న ఐదారేళ్లలో రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల గ్రీన్‌ పవర్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

20 వేల మెగావాట్ల  గ్రీన్‌ పవర్‌ను ఉత్పత్తి చేస్తాం

  • ఐదేళ్లలో తయారయ్యేలా ప్రణాళికలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • పామాయిల్‌కు ఉజ్వల భవిత: తుమ్మల

  • సాగుకు సర్కారు పెద్ద పీట: పొంగులేటి

అశ్వారావుపేట/అశ్వారావుపేట రూరల్‌, అక్టోబరు 13: రానున్న ఐదారేళ్లలో రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల గ్రీన్‌ పవర్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతులకు పంటతో పాటు అదనపు ఆదా యం వచ్చేలా మోటార్లకు సోలార్‌ పంపు సెట్లను అమర్చి, మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో రూ.36 కోట్లతో నిర్మించిన బయో విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను శనివారం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో భట్టి మాట్లాడారు.

ప్రకృతి వనరులతో లభించే విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి కొత్త ఎనర్జీ పాలసీని తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. పామాయిల్‌ పంటకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం పామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. టన్ను పామాయిల్‌ గెల ధర రూ.20వేల వరకు పెరిగే అవకాశం ఉందనాట్నరు.

కేంద్రంతో మాట్లాడి దిగుమతి సుంకాన్ని పెంచేలా కృషి చేశామని, భవిష్యత్‌లో కనీస మద్దతు ధర కోసం ఏపీ, కర్ణాటక రైతులతో కలిసి కేంద్రంతో మాట్లాడతామని తెలిపారు. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లోనూ పామాయిల్‌ వేయడానికి అనుమతులున్నాయని.. రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బడ్జెట్‌లోనూ అధికంగా నిధులు కేటాయించి అన్నదాతల అభివృద్ధికి పాటు పడుతోందని తెలిపారు.


  • ఇందిరా డెయిరీని ఆదర్శంగా నిలుపుతాం: భట్టి

ఎర్రుపాలెం: పాల ఉత్పత్తిలో ఇందిరా మహిళా డెయిరీని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని భట్టి విక్రమార్క అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో కో-ఆపరేటివ్‌ సొసైటీని రూపొందించి.. పాడి రంగంలో మహిళలను వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఇందిరా మహిళా డెయిరీని ఆదివారం భట్టి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పరిశ్రమ ద్వారా వచ్చే ప్రతి పైసా మహిళా సభ్యులకే చెందేలా ప్రాజెక్టును రూపకల్పన చేశామని వెల్లడించారు రాష్ట్రంలోని మహిళా స్వయంసహాయక సంఘాల సభ్యులకు ఏటా రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణాలి వ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి ప్రకటించారు.

Updated Date - Oct 14 , 2024 | 04:57 AM