Share News

BC Welfare: బీసీ రిజర్వేషన్లు పెంచాలి..

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:25 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీ కులగణన చేసి.. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

BC Welfare: బీసీ రిజర్వేషన్లు పెంచాలి..

  • ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు పెట్టాలి

  • బీసీ సంఘాల సమావేశంలో తీర్మానం

ఖైరతాబాద్‌, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీ కులగణన చేసి.. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సమగ్ర కులగణనను వెంటనే ప్రారంభించి బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలనే ప్రధాన డిమాండ్‌తో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు, బీసీ కుల సంఘాల సంయుక్త సమావేశం గురువారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో నిర్వహించారు.


బీసీ సంక్షేమ సంఘం నేత వేముల వెంకటేశ్‌ అధ్యక్షత వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ కులగణన చేపట్టకపోతే ఈ నెల 26న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, సెప్టెంబరు 6న లక్షలాది మంది బీసీలతో కులగణన మార్చ్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. అప్పటికీ కులగణన చేయకుండా ఎన్నికలకు వెళితే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామన్నారు.


అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయమే చేశాయని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిరంజీవులు అన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదనే నిబంధన ఏమీ రాజ్యాంగంలో లేదన్నారు. బీసీల గణనతో పాటు రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అంకితభావంతో ఉన్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. బీసీల్లో ఇప్పడున్న చైతన్యం అప్పుడు ఉండి ఉంటే తాను సీఎం అయ్యేవాడినని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 03:25 AM