‘రైతుభరోసా’ ఉపసంఘం చైర్మన్‌గా భట్టి
ABN , Publish Date - Jul 03 , 2024 | 05:24 AM
రైతుభరోసా పథకం అమలుకు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
సభ్యులుగా శ్రీధర్‌బాబు, తుమ్మల, పొంగులేటి.. జీవో జారీ
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రైతుభరోసా పథకం అమలుకు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. చైౖర్మన్‌గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్లను గత నెల 21న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ప్రకటించారు.
అయితే ఈ ఉపసంఘం ఏర్పాటుపై 11 రోజుల తర్వాత.. మంగళవారం సీఎస్ శాంతికుమారి జీవో జారీ చేయడం గమనార్హం. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీ.. రైతుభరోసా పథకం మార్గదర్శకాలపై అధ్యయ నం చేస్తుంది. ఈ కమిటీకి రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
అసెంబ్లీ సమావేశాల్లోనూ రైతుభరోసాపై చర్చించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈనెల 15 నాటికి నివేదిక ఇవ్వాలని సబ్‌కమిటీకి క్యాబినెట్ భేటీలోనే సూచించారు. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రహదారులు, సాగుకు యోగ్యంలేని భూములకు రైతుభరోసా ఇవ్వకూడదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పీఏసీఎస్‌ల్లో భేటీలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రైతుసంఘాల నేతలు, ఇతరవర్గాల అభిప్రాయాలు తీసుకొని మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతలు ఉపసంఘానికి అప్పగించారు.