Bhatti Vikramarka: సమాజ హితానికే..
ABN , Publish Date - Oct 08 , 2024 | 03:23 AM
మూసీ పునరుజ్జీవనం, చెరువుల సంక్ష రక్షణ తమ వ్యక్తిగత ఎజెండా కాదని.. అందులో తమ స్వార్థం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
మూసీ, చెరువుల ప్రక్షాళన.. మా స్వార్థానికి కాదు
నిర్వాసితులకు న్యాయం మా బాధ్యత
కబ్జాల తీరును జీఐఎస్ మ్యాపుల సాయంతో వివరించిన భట్టి
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మూసీ పునరుజ్జీవనం, చెరువుల సంక్ష రక్షణ తమ వ్యక్తిగత ఎజెండా కాదని.. అందులో తమ స్వార్థం ఏమీ లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అవి.. ఈ ప్రాంతంలోని వనరులు, ఆస్తులను ప్రజలపరం చేయాలనే సామాజిక లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలని ఆయన పేర్కొన్నారు. కానీ.. కొందరు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చాకయినా రాష్ట్ర వనరులు, ఆస్తులను కాపాడుకునే చర్యలు చేపట్టకపోవడం వల్ల 2014 నుంచి 2023 వరకు వందలాది చెరువులు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు. చెరువులు ఏ విధంగా కబ్జాకు గురయ్యాయో వివరిస్తూ.. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాకు శాటిలైట్ మ్యాపుల ఆధారాలతో కూడిన వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు.
హెచ్‌ఎండీఏ పరిధిలో 920 చెరువులు ఉండేవని..రాష్ట్రం ఏర్పడేనాటికి అందులోని 225 చెరువులు పూర్తిగా కబ్జాకు గురై కనుమరుగైపోయాయని, 196 చెరువులు పాక్షికంగా కబ్జాలకు గురయ్యాయని వివరించారు. 2014 నుంచి 2023 వరకు 44 చెరువులు పూర్తిగా కబ్జాకు గురవ్వగా, 127 చెరువులు పాక్షికంగా ఆక్రమణలోకి వెళ్లాయని తెలిపారు. హైదరాబాద్ అంటే ఒకప్పుడు రాక్స్, పార్క్స్, లే క్స్ సిటీ అని.. అవన్నీ కబ్జాలకు గురవడంతో ఇప్పుడు నగరం అందం దెబ్బతిన్నదని, ముంపు సమస్యను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము రూపొందించిన మ్యాపులు కేవలం ఎఫ్‌టీఎల్ పరిధికి మాత్రమే పరిమితమయ్యాయని.. బఫర్ జోన్ విషయంలోకి తామింకా వెళ్లలేదని చెప్పారు. చెరువులు కబ్జా అయిన తీరు చూసి.. తాము నిర్మాణాలను తొలగించాలో లేదో ప్రతిపక్షాల నేతలు, విమర్శలకు పాల్పడుతున్న వారు చెప్పాలని అన్నారు.
గత ప్రభుత్వాలు కూడా చెరువుల ఆక్రమణ, మూసీ సుందరీకరణ గురించి మాట్లాడాయనీ, కబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఆ పని చేయలేకపోయాయని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు, సమాజానికి మంచి చేసే కార్యక్రమం చేపడుతోందని చెప్పారు. హైదరాబాద్‌కు గ్లోబల్ సిటీ అయ్యే లక్షణాలన్నీ ఉన్నాయనీ, ఆ దిశగా తాము వెళ్లడం ఇష్టమో కాదో ప్రతిపక్షాలు స్పష్టం చేయాలన్నారు. మూసీ నిర్వాసితులకు సంతృప్తికరమైన నష్టపరిహారం చెల్లిస్తామని భట్టి స్పష్టం చేశారు. పట్టా లేకపోయినా పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఎక్కడైనా అసంతృప్తి ఉంటే ప్రతిపక్షాలు తమకు చెప్పాలని, మేలైన ప్యాకేజీ ఏమిటో సూచించాలన్నారు. తాము దాన్ని అమలు చేయకపోతే అప్పుడు నిరసనలు వ్యక్తం చేయాలన్నారు. త్వరలో తాను ఈ విషయంపై వివిధ రాజకీయ పార్టీలకు లేఖ రాస్తానని తెలిపారు.