Share News

Bhatti Vikramarka: పదేళ్ల పాలనలో అంతా మోసమే!

ABN , Publish Date - Dec 05 , 2024 | 03:14 AM

రాష్ట్రంలో గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఉపముఖ్యమంత్రి భట్టి చెప్పారు. నీళ్లు, నియామకాల కోసం కొట్లాడి సాధించిన తెలంగాణలో ప్రజలు పదేళ్ల పాటు వంచనకు గురయ్యారన్నారు.

Bhatti Vikramarka: పదేళ్ల పాలనలో అంతా మోసమే!

  • ప్రజలందరినీ వంచించిన గత సర్కారు.. ఏడాదిలోనే మేం 55 వేల ఉద్యోగాలిచ్చాం!

  • ప్రజల ప్రేమాభిమానాలే మాకు ఆక్సిజన్‌.. పెద్దపల్లి సభలో ఉపముఖ్యమంత్రి భట్టి

పెద్దపల్లిటౌన్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఉపముఖ్యమంత్రి భట్టి చెప్పారు. నీళ్లు, నియామకాల కోసం కొట్లాడి సాధించిన తెలంగాణలో ప్రజలు పదేళ్ల పాటు వంచనకు గురయ్యారన్నారు. అన్ని వర్గాల వారి బాధలు తీర్చేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని భట్టి తెలిపారు. బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన ‘యువ వికాసం’ సభకు హాజరైన భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజలు చూపించే ప్రేమాభిమానాలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆక్సిజన్‌ లాంటివన్నారు. తమ ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే 55 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించిందని చెప్పారు. టీజీపీఎస్సీ ద్వారా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. యువత సాంకేతికంగా బలంగా ఉండాలనే ఆలోచనతో స్కిల్స్‌ యూనివర్సిటీ, అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సింగరేణి కార్మికులకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. కోటి ప్రమాద బీమా అందజేయనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో రూ.వెయ్యి కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు చెప్పారు. ప్రజా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. తాము పనులపైనే దృష్టి సారించాం తప్ప ప్రచారాలపై కాదన్నారు.


దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని వివరించారు. రామగుండంలో కొత్త విద్యుత్కేంద్రానికి త్వరలో భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లను నిర్మించామని, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బస్సు డిపో కలను నెరవేర్చామని చెప్పారు. రాష్ట్రానికి వేల కోట్ల కొత్త పెట్టుబడులతో ప్రైవేట్‌ రంగంలో లక్షల మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. రామగుండంలో కొత్త ఎయిర్‌ పోర్టు ఏర్పాటు కోసం కేంద్రంతో చర్చిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు ఉపయోగించకుండా లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని.. 153 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిందని చెప్పారు. 6న సీఎం, మంత్రివర్గ సహచరుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - Dec 05 , 2024 | 03:14 AM