Bhatti: తెలంగాణ తల్లి విగ్రహం ప్రజల మనోభావాలకు అద్దం
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:50 AM
తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విగ్రహ ఆవిష్కరణ పండుగ.. ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు.
ప్రతి ఏటా డిసెంబరు 9న ఉత్సవం
బీఆర్‌ఎస్ నేతలకు అధికారం పైనే ప్రేమ
తెలంగాణ తల్లి అంటే గౌరవం లేదు: భట్టి
మా నాయనమ్మ గుర్తుకొస్తోంది: దామోదర
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విగ్రహ ఆవిష్కరణ పండుగ.. ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తుంటే ఒక అమ్మ, ఒక నాయనమ్మ కనిపిస్తున్నారని, చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సోమవారం శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై, శాసనమండలిలోనూ భట్టి విక్రమార్క మాట్లాడారు. సభలో సీఎం ప్రకటనపై సభ్యులందరూ చర్చించాలని మంచి సంప్రదాయానికి ప్రభుత్వం తెరతీస్తే.. సభలో తమ అభిప్రాయాలు చెప్పకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయటికి పోవడం సరికాదన్నారు. ప్రతిపక్షం సభలో ఉండి వారి అభిప్రాయాలను పంచుకుని ఉంటే బాగుండేదని, కానీ.. బీఆర్‌ఎస్ వాళ్లకు అధికారంపై ప్రేమ తప్ప.. తెలంగాణపై, తెలంగాణ తల్లిపై గౌరవం లేదని విమర్శించారు. ప్రతి ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం శాసనమండలిలో ప్రకటించారు. తెలంగాణ కీర్తిని విశ్వవేదికపై వైభవోపేతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.
మా నాయనమ్మ గుర్తుకొస్తోంది..
‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తుంటే మా నాయనమ్మ గుర్తుకొస్తోంది’’ అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొన్ని విషయాలు బాధ కలిగించాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, కవులు, కళాకారులే ఎక్కువగా ఉద్యమించారని, కానీ.. గత పదేళ్లలో వారికి సముచిత గుర్తింపు దక్కలేదన్న బాధ తనలో ఉందన్నారు. పట్టుదలకు, తెగింపునకు ప్రతిరూపం ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలన్నారు. తాను ఉస్మానియా నుంచే వచ్చానని, తనలో ఉన్న పట్టుదల, తెగింపు తత్వంతోనే ఇంతదూరం రాగలిగానని తెలిపారు.కాగా, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మార్చాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసనమండలిలో మాట్లాడుతూ కోరారు. టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ డిసెంబరు 9ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంకురార్పణ దినోత్సవంగా పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పల్లె తల్లుల శ్రమైక జీవితానికి ప్రతిరూపంగా ఉందని అలగుబెల్లి నర్సిరెడ్డి ప్రశంసించారు. కాగా, ప్రభుత్వం మారినపుడల్లా విగ్రహం రూపాన్ని మార్చకుండా కట్టడి చేసేందుకు చట్టం చేయాలని ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, ఎవీఎన్ రెడ్డి కోరారు.
శాసనమండలి 16కు వాయిదా
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సోమవారం ఉదయం చర్చ అనంతరం శానసమండలి సమావేశాలు వచ్చే ఈ నెల 16కు వాయిదా పడ్డాయి. కాగా, సోమవారం.. మండలికి నూతనంగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, ఆమెర్ అలీఖాన్‌లను చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభకు పరిచయం చేశారు. శాసన మండలి కార్యకలాపాలపై సభ్యులకు రెండురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.