Share News

Bhatti Vikramarka: ఆనాడు అధికారికంగా ఎందుకు ప్రతిష్ఠించలేదు?

ABN , Publish Date - Dec 10 , 2024 | 04:34 AM

తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతున్నారని విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. గత పదేళ్లు అధికారంలో ఉండి అధికారికంగా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

Bhatti Vikramarka: ఆనాడు అధికారికంగా ఎందుకు ప్రతిష్ఠించలేదు?

  • విగ్రహాన్ని మార్చుతున్నారని ఇప్పుడు విమర్శలా?

  • పదేళ్లు బీఆర్‌ఎస్‌ రాజ్యహింస పాలన సాగించింది

  • తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతున్నారని విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. గత పదేళ్లు అధికారంలో ఉండి అధికారికంగా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు తలెత్తుకునే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన డిసెంబర్‌ 9వ తేదీని సర్కారు ఏటా రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తుందని ప్రకటించారు. సోమవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘గత పదేళ్ల పాటు ఆత్మగౌరవంతో బతకాల్సిన ప్రజలను బందీ చేసి అనుక్షణం అవమానాలకు గురి చేసి బీఆర్‌ఎస్‌ సర్కారు రాజ్యహింసతో పాలన సాగించింది. తెలంగాణను మిగులు బడ్జెట్‌తో అప్పగిస్తే రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఆనాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు నిర్వహించగా, సీఎల్పీ నాయకుడిగా నేను ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్‌ పాదయాత్ర చేశా.. ప్రజలు కాంగ్రె్‌సను ఆశీర్వదించి అధికారాన్ని కట్టబెట్టారు.


తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్టుగా ప్రజాస్వామ్యయుత పాలన అందిస్తున్నాం. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి 56 వేల మందికి ఉద్యోగాలిచ్చాం. మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో ఎదగాలని ఏటా రూ.20 వేల కోట్లు వడ్డీ లేకుండా రుణాలిస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలిచ్చి వారిని వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దబోతున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉన్న రూ.21 వేల కోట్లతో రైతుల రుణాల మాఫీ చేశాం’ అని చెప్పారు. తెలంగాణ ప్రజలు తలెత్తుకునే విధంగా మన అమ్మ, అక్క, నాయనమ్మ ప్రతిరూపంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నామన్నారు. అమ్మగా, ఆరాధ్య దైవంగా, పోరాటానికి స్ఫూర్తిగా, పసిడి పంటలు పండించే తల్లిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. ధరించిన ఆకుపచ్చ చీర ప్రగతిశీల భావాలు, ఉద్యమాలకు గుర్తుగా ఎరుపు రంగు, బహుజనుల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసే విధంగా నీలం రంగు, రాజ్య హింస పెరిగినప్పుడు ప్రజలు తిరుగుబాటుకు గుర్తుగా పిడికిళ్లతో విగ్రహాన్ని రూపొందించామన్నారు.

Updated Date - Dec 10 , 2024 | 04:34 AM