Alleti Maheshwar Reddy: దేవుళ్లపై ఒట్టేసి.. రైతులకు దగా
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:16 AM
దేవుళ్లు, దర్గాలపై ఒట్టేసి ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. కొంత మందికే మాఫీ చేసి మిగతా రైతులను మోసం చేశారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
సగం మందికి కూడా మాఫీ కాలేదు: ఏలేటి
నిర్మల్/నిజామాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు23 (ఆంధ్రజ్యోతి): దేవుళ్లు, దర్గాలపై ఒట్టేసి ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. కొంత మందికే మాఫీ చేసి మిగతా రైతులను మోసం చేశారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నిర్మల్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదురుగా రుణమాఫీపై బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. తమకున్న సమాచారం ప్రకారం దాదాపు 60 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోగా, 22 లక్షల మందికి మాత్రమే ఇప్పటి వరకు రుణమాఫీ జరిగినట్లు తెలిసిందన్నారు.
ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీపై చేయకుంటే హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ఏలేటి హెచ్చరించారు. రైతులకు రూ.2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం షరతులు విధించి 30 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో 2.5 లక్షల మందికి పైగా రైతులు రుణాలు తీసుకుంటే 83 వేల మందికి మాత్రమే ఇప్పటి వరకు రుణమాఫీ చేశారని చెప్పారు.
సోనియా నివాసానికి ఎంపీ రఘునందన్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి శుక్రవారం ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెళ్లారు. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని బ్లిట్జ్ పత్రికలో వచ్చిన వ్యాసానికి సంబంధించిన ప్రతులను తీసుకెళ్లారు. రాహుల్ గాంధీని కలిసి వాటిని అందజేసే ప్రయత్నం చేయగా.. ఆయన సమావేశంలో ఉన్నారని సిబ్బంది చెప్పారు. దీంతో ఆ ప్రతులను అక్కడి సిబ్బందికి ఇచ్చారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడారు. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని బ్లిట్జ్ పత్రికలో వచ్చిన కథనానికి సోనియా, రాహుల్ స్పందించాలని కోరారు.