BJP: కాంగ్రెస్‌వి ప్రజా వంచన ఉత్సవాలు
ABN , Publish Date - Nov 21 , 2024 | 04:21 AM
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని విధాలుగా మోసం చేసిందని, కాంగ్రెస్ చేసుకునేవి ప్రజాపాలన విజయోత్సవాలు కాదని.. ప్రజా వంచన ఉత్సవాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఓ అసమర్థ ముఖ్యమంత్రి
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: ఏలేటి
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: రాణి రుద్రమ
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని విధాలుగా మోసం చేసిందని, కాంగ్రెస్ చేసుకునేవి ప్రజాపాలన విజయోత్సవాలు కాదని.. ప్రజా వంచన ఉత్సవాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ప్రజలకు చెప్పుకునేది ఏమీ లేకే విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఒక అసమర్థుడు సీఎం అయితే రాష్ట్రం ఏ రకంగా దివాలా తీస్తుందో, పాలన ఎలా అస్తవ్యస్తంగా మారుతుందో అనే వాటికి రేవంత్ రెడ్డే ఉదాహరణ అన్నారు. కాంగ్రెస్ 11 నెలల పాలనలో ప్రజలు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి ఎగవేతల సీఎంగా రేవంత్ గుర్తింపుపోందారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేని అసమర్థ సీఎం అని పేర్కొన్నారు. సీఎం పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియకే సోనియా కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకుంటానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు సోనియాను బలిదేవత అని సంబోధించిన రేవంత్, ఇవాళ తన పదవిని కాపాడుకునేందుకు దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారని విమర్శించారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో ఫార్మాసిటీ పేరుతో గిరిజనుల భూములు గుంజుకోవడానికి చేస్తున్న అరాచకాలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అపజయోత్సవాలు చేసుకోవాల్సింది పోయి, విజయోత్సవాలు చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ చేసిన ప్రకటనను అమలు చేయకుండా మళ్లీ ఇప్పుడు అదే చోటు నుంచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 64 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికే మాఫీ చేశారని విమర్శించారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ అన్నారు. అడ్డెదు ప్యాలాలు బుక్కిన ఆకలి తీరదన్నట్టు అడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రాన పరిపాలన చేసినట్టు కాదు అనే సామెత సీఎం రేవంత్ రెడ్డికి సరిగ్డా సరిపోతుందన్నారు. కాగా రాష్ట్రంలో జరుగుతున్న కులగణను పారదర్శకంగా నిర్వహించి, ఆ విరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనందగౌడ్ అన్నారు. డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్లును బుధవారం కలిశారు. కులగణన సర్వేపై బీజేపీ ఓబీసీ మోర్చా అభిప్రాయాలను కమిషన్‌కు వివరించారు.