Alleti Maheshwar Reddy: జూన్‌కల్లా సీఎం మార్పు..
ABN , Publish Date - Nov 02 , 2024 | 05:09 AM
వచ్చే ఏడాది జూన్‌కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం దించేస్తుంది
సీఎంగా ఉత్తమ్ లేదా భట్టికి అవకాశం
రేవంత్ కాంగ్రెస్‌ను చీలిస్తే బీఆర్‌ఎస్‌దే పవర్
బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జూన్‌కల్లా కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దింపేస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన స్థానంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేదా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం పదవి దక్కవచ్చన్నారు. ఎవరిని నియమించాలన్నదానిపై పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోందని, ఇప్పటికే దీనిపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కమిటీ, అంతర్గతంగా సమీక్ష నిర్వహిస్తోందన్నారు. శుక్రవారం మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రె్‌సలోని ఒకవర్గం రేవంత్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ చేస్తోందని చెప్పారు. మంత్రులు, సీనియర్ నాయకుల ఫిర్యాదులను సీరియ్‌సగా తీసుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్.. రేవంత్ 7సార్లు ఢిల్లీకి వెళ్లినా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు.
‘‘హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, సీనియర్ నేత కేవీపీ రాంచందర్‌రావు సహా కొందరు మంత్రులు, సీనియర్ నాయకులు సోనియా దృష్టికి తీసుకువెళ్లారు. సోనియా గాంధీ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఫోన్‌చేసి రేవంత్‌తో మాట్లాడాలని సూచించారు. అయితే, డీకే ఫోన్‌కు రేవంత్ స్పందించలేదు. పైగా, అధిష్ఠానం నుంచి ఫోన్ వచ్చినా తాను స్పందించలేదని రేవంత్ ఇటీవల గొప్పగా చెప్పుకొన్నారు. దీనిని కూడా హైకమాండ్ సీరియ్‌సగా తీసుకుంది’’ అని మహేశ్వర్‌రెడ్డి వివరించారు. ‘‘తనను సీఎం చేస్తే బీఆర్‌ఎస్ ఎల్పీ కాంగ్రె్‌సలో విలీనం అవుతుందని రేవంత్ కాంగ్రెస్ అధినాయకత్వానికి చెప్పారు. కానీ పది మందికి మించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాలేదు. పార్టీ అధినాయకత్వానికి రేవంత్‌పై ఆగ్రహానికి ఇది కూడా మరో కారణం’’ అని తెలిపారు. అయితే, కాంగ్రెస్ అధినాయకత్వం సీఎం మార్చి, రేవంత్ కాంగ్రె్‌సను చీలిస్తే.. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మహేశ్వర్‌రెడ్డి జోస్యం చెప్పారు.
ఆయన చిలక జోస్యం చెప్పుకోవాలి: అడ్లూరి
మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. ఆయన ఎమ్మెల్యే కంటే చిలక జ్యోతిష్యుడిగా సరిపోతారని ఎద్దేవా చేశారు. మరోవైపు, మహేశ్వర్‌రెడ్డికి సొంత పార్టీ బీజేపీలోనే ప్రాధాన్యం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ అన్నారు.