Alleti Maheshwar Reddy: ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Nov 04 , 2024 | 04:05 AM
సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని ప్రజలు ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
బడ్జెట్‌తో సంబంధంలేని హామీలతో మోసం.. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు
ఖర్గే వ్యాఖ్యలతో తేటతెల్లం: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హనుమకొండ టౌన్/హైదరాబాద్/నిజామాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డిని ప్రజలు ఎగవేతల రేవంత్‌రెడ్డి అంటున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బడ్జెట్‌తో సంబంధంలేని 420 హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా మోసం చేశారని ఽధ్వజమెత్తారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు చూస్తుంటే.. మాయమాటలు చెప్పి రేవంత్ అఽధికారంలోకి వచ్చినట్లుగా ఉందన్నారు. అమలుకు నోచుకోని హామీలిచ్చి రేవంత్‌రెడ్డి పార్టీని తప్పుదోవ పట్టించారని ఖర్గే వాఖ్యలు ఉన్నాయని అన్నారు. ఆదివారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని ప్రధానికి బహిరంగ లేఖ రాయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. రేవంత్ కుటుంబం, కోటరీ, గుత్తేదారుల్లో వెలుగులు వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ హామీల్లో ఏ ఒక్క హామీ అమలు చేసినట్లు ఒప్పుకున్నా.. బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రైతు డిక్ష్లరేషన్, యువతకు 2 లక్షల ఉద్యోగాలు, వృద్ధులకు రూ.4వేల పింఛన్, మహిళలకు నెలకు రూ.2,500 సాయం, అభయహస్తం పథకానికి చట్టబద్ధత హామీలు ఏమయ్యాయని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ఆయా వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. వరి కోతలు పూర్తవుతున్నా రైతాంగంపట్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదని ఏలేటి విమర్శంచారు.
కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలిచ్చింది..?: లక్ష్మణ్
రైతు రుణమాఫీకి, రేషన్‌కార్డుకు లింకు పెట్టడం ఏంటని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు రుణాలు ఇచ్చినప్పుడు రేషన్‌కార్డు ఆధారంగానే ఇచ్చారా..? అని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని, రైతుబంధు పెంచి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. వాటిని ఎగ్గొట్టిందని విమర్శించారు. బోనస్ బోగస్ అయిందని, పంటలు కొనే దిక్కు లేదని, పత్తి రైతులకు మద్దతు ధర లేదని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలు ఎప్పుడు నిర్వహించారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు జల్సాలు, తెలంగాణకు దమ్మిడీ ఉపయోగం లేని విదేశీ పర్యటనలు చేస్తున్నారని లక్ష్మణ్ ఒక ప్రకటనలో విమర్శించారు.
ఖర్గే నిజమే చెప్పారు: అర్వింద్
ఎన్నికల సమయంలో ఉచితాల ప్రకటనలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అబద్ధపు హామీలను బయటపెట్టాయని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ఎన్నికల సమయంలో దేవుళ్ల మీద ఒట్లు వేసి రేవంత్‌రెడ్డి రైతులను నట్టేట ముంచాడని, ఇప్పటికీ హామీలను అమలు చేయడం లేదని అన్నారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం అర్వింద్ మాట్లాడారు. కేటీఆర్‌ది అహంకార ధోరణి అని.. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేడిపండులా ఉందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఉచిత బస్సు పేరుతో ఉన్న బస్సులను రద్దు చేశారని.. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హైడ్రా దెబ్బకు రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, పెట్టుబడులు నిలిచిపోయాయని ఆరోపించారు. సీఎం రేవంత్‌కు, ప్రధాని మోదీని విమర్శించే అర్హత లేదని డీకే అరుణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.