Share News

Visa Lottery Rigging: హెచ్‌1బీ వీసాల లాటరీ రిగ్గింగ్‌

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:07 AM

అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే హెచ్‌1బీ వీసా లాటరీ వ్యవస్థలో రిగ్గింగ్‌ జరుగుతోందని.. ఆదిలాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ కంది శ్రీనివా్‌సరెడ్డికి అందులో ప్రమేయం ఉందని పేర్కొంటూ అమెరికాకు చెందిన బ్లూమ్‌బెర్గ్‌ వార్తాసంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

Visa Lottery Rigging: హెచ్‌1బీ వీసాల లాటరీ రిగ్గింగ్‌

  • ఆదిలాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌

  • కంది శ్రీనివా్‌సరెడ్డిపై సంచలన ఆరోపణలు

  • ఒకే అభ్యర్థి పేరిట పెద్దఎత్తున దరఖాస్తులు

  • చర్చనీయాంశంగా బ్లూమ్‌ బెర్గ్‌ వార్తా కథనం

  • నా వ్యాపారాలను దెబ్బతీసే కుట్ర

  • చట్టపరంగా చర్యలు తీసుకుంటా: కంది

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పించే హెచ్‌1బీ వీసా లాటరీ వ్యవస్థలో రిగ్గింగ్‌ జరుగుతోందని.. ఆదిలాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ కంది శ్రీనివా్‌సరెడ్డికి అందులో ప్రమేయం ఉందని పేర్కొంటూ అమెరికాకు చెందిన బ్లూమ్‌బెర్గ్‌ వార్తాసంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అమెరికాలోని కంపెనీలు.. విదేశాలకు చెందిన ప్రతిభావంతులను తమ సంస్థలో నియమించుకోవడానికి వీలు కల్పించే మార్గమే ‘హెచ్‌-1బీ’ వీసా. ఉదాహరణకు.. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి కంపెనీలు నేరుగా కొంతమందిని నియమించుకుని వారికి హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేస్తాయి. అయితే, ఈ వీసాలు చాలా పరిమితంగా ఉండడం.. దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య అందుకు కొన్ని రెట్ల సంఖ్యలో ఉండడంతో ప్రభుత్వమే లాటరీ ద్వారా ఎంపిక చేస్తుంది. ఆ లాటరీలో ఆయా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నవారికి వీసా రావచ్చు.


రాకపోవచ్చు. ఒక అభ్యర్థికి వీసా వచ్చే అవకాశం పెరగాలంటే.. ఆ అభ్యర్థి పేరుతో ఎక్కువ కంపెనీల ద్వారా దరఖాస్తు చేయడం (మల్టిపుల్‌ రిజిస్ట్రేషన్లు) ఒక మార్గం. కానీ, అది మోసం కిందికి వస్తుంది. ఆయా సంస్థల తరఫున హెచ్‌-1బీ వీసా పొందిన అభ్యర్థులను వారు వేరే కంపెనీలకు అద్దెకిస్తారు. అలాంటి మోసానికి పాల్పడ్డారన్నదే కంది శ్రీనివా్‌సరెడ్డిపై వచ్చిన ఆరోపణ. అమెరికాలో ఎమ్మెస్‌ చేసిన కంది శ్రీనివా్‌సరెడ్డి అక్కడే ఒక కంపెనీలో టెక్‌ కన్సల్టెంట్‌గా చేరారు. డాల్‌సలో స్థిరపడ్డారు. 2013లో ఆయన ‘క్లౌడ్‌బిగ్‌ డేటా టెక్నాలజీస్‌ ఎల్‌ఎల్‌సీ’ పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. 2020లో ఆ సంస్థ 280 వీసాల కోసం దరఖాస్తు చేసిందని.. శ్రీనివా్‌సరెడ్డి ఇదే తరహా పేరున్న మరో డజను కంపెనీలను నియంత్రిస్తున్నారని.. 2020 నుంచి ఇప్పటిదాకా ఆ కంపెనీలన్నీ కలిపి 300కుపైగా హెచ్‌-బీ దరఖాస్తులను పొందాయని.. బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది.


వీసాలు వచ్చాక.. ఆ కంపెనీలు ఆయా ఉద్యోగులను మెటా ప్లాట్‌ఫామ్స్‌, హెచ్‌ఎ్‌సబీసీ, వంటి కంపెనీలకు ఇచ్చాయని వెల్లడించింది. క్లౌడ్‌ బిగ్‌ డేటా కంపెనీ సదరు ఉద్యోగుల జీతంలో 20-30ు తీసుకున్నట్టు వివరించింది. అయితే.. కంది శ్రీనివాస్‌ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. రాజకీయ కక్షతో కొందరు తన వ్యాపారాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రాజకీయంగా ఎదుర్కొలేకనే నా మీద, నా కంపెనీల మీద బురద జల్లుతున్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. లీగల్‌ నోటీసులు ఇచ్చి పరువు నష్టం కేసులు వేస్తా. మీడియాలో దుష్ప్రచారం చేసే వారిపై సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తా’’ అని హెచ్చరించారు.


  • నిరుడు భారీగా దరఖాస్తులు

అమెరికాలో 2020 నుంచి హెచ్‌1బీ వీసాల దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2023లో 4,46,000 దరఖాస్తులు రాగా.. ఆ ఏడాది జారీ చేసినవి కేవలం 85వేలు మాత్రమే. అందులో 11,600 వీసాలు బహుళజాతి ఔట్‌సోర్సింగ్‌ కంపెనీలకు వెళ్లాయి. మరో 22,600 వీసాలను ‘ఐటీ స్టాఫింగ్‌ సంస్థలు’ దక్కించుకున్నాయి. ఈ ఔట్‌సోర్సింగ్‌, ఐటీ స్టాఫింగ్‌ సంస్థలే మల్టిపుల్‌ రిజిస్ట్రేషన్లతో లాటరీ వ్యవస్థను రిగ్‌ చేశాయని బ్లూమ్‌బెర్గ్‌ వార్తాకథనం సారాంశం. అలా మల్టిపుల్‌ రిజిస్ట్రేషన్ల ద్వారా నిరుడు ఆయా కంపెనీలు 15,500 వీసాలు పొందినట్లు అందులో పేర్కొంది. అంటే గత ఏడాది కేటాయించిన మొత్తం వీసాల్లో.. దాదాపుగా ప్రతి ఆరు వీసాల్లో ఒకటి ఈ దందా ద్వారా వచ్చిందేనని వెల్లడించింది. ఇలా ఒకే అభ్యర్థి పేరిట ఒక స్టాఫింగ్‌ సంస్థ డజను కంపెనీల ద్వారా పదిసార్లు దరఖాస్తు చేయడంతో అర్హులైన వారికి అన్యాయం జరిగిందని వెల్లడించింది.

Updated Date - Aug 03 , 2024 | 05:07 AM