Share News

Palla Rajeshwar Reddy: భూ బాధితులను తోసివేస్తున్న అనురాగ్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే పల్లా భూ కబ్జా!

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:54 AM

చెరువు బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు కేసు నమోదైన బీఆర్‌ఎస్‌ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. తమ భూమిని కూడా కబ్జా చేశారంటూ ఇద్దరు బాధితులు మీడియా ముందుకు వచ్చారు.

Palla Rajeshwar Reddy: భూ బాధితులను తోసివేస్తున్న అనురాగ్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే పల్లా భూ కబ్జా!

  • ఎకరాలు కబ్జా చేశారన్న బాధితులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 26: చెరువు బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు కేసు నమోదైన బీఆర్‌ఎస్‌ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. తమ భూమిని కూడా కబ్జా చేశారంటూ ఇద్దరు బాధితులు మీడియా ముందుకు వచ్చారు. కబ్జా చేసిన భూమిలోనే నీలిమ ఆస్పత్రి పార్కింగ్‌ ఏర్పాటు చేశారని వారు ఆరోపించారు. బాధితులు హయత్‌నగర్‌ మండలం కుంట్లూర్‌కు చెందిన మాజీ సర్పంచ్‌ కళ్లెం ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్‌ సోమవారం మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లో నీలిమ ఆస్పత్రి సమీపంలోని తమ భూమిలో విలేకరులతో మాట్లాడారు.


వెంకటాపూర్‌ పంచాయతీ కొర్రెముల రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 796లోని 11.20 ఎకరాల భూమిని తాము భాగస్వాములతో కలిసి 2008లో కొనుగోలు చేశామన్నారు. అనంతరం 7.20 ఎకరాల భూమిని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్‌ విద్యాసంస్థలు, గాయత్రి ఎడ్యుకేషన్‌ ట్రస్టుకు విక్రయించినట్లు తెలిపారు. అయితే రాజేశ్వర్‌రెడ్డి తాను కొనుగోలు చేసిన భూమిలోనే కాకుండా తమ భూమిని సైతం కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారని తెలిపారు.


గత మూడేళ్ల నుంచి అధికార బలంతో తమను తమ భూమిలోకే రానివ్వకుండ తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. కాగా, వీరు మీడియాతో మాట్లాడుతుండగా అనురాగ్‌ యూనివర్సిటీ ప్రతినిధులు అడ్డుకొని దాడికి దిగారు. ఇరు వర్గాల వారు పరస్పరం దూషణలు, ప్రతిదాడులు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాల వారిని పంపించివేశారు. అనంతరం పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌లో రెండు వర్గాల వారు పరస్పరం ఫిర్యాదు చేశారు.


  • చట్ట ప్రకారమే భూమిని కొనుగోలు చేశాం: గాయత్రి ఎడ్యుకేషనల్‌ ట్రస్టు

అనురాగ్‌ విద్యాసంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ పేరిట చట్టప్రకారమే భూమిని కొనుగోలు చేశామని ట్రస్టు ఎ.ఓ. మధుకర్‌రెడ్డి తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు పొందిన తరువాతే నిర్మాణాలు చేపట్టామన్నారు. కళ్లెం ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్‌ తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి తమ సిబ్బందిని దూషించారని తెలిపారు. తమ చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కావాలనే ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Aug 27 , 2024 | 07:41 AM