Share News

స్పీకర్‌ నిష్ర్కియాపరత్వంపై న్యాయసమీక్ష చేయొచ్చు!

ABN , Publish Date - Nov 08 , 2024 | 03:38 AM

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం స్పీకర్‌ తన ఎదుట ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా చూస్తూ ఊరికే ఉంటానంటే కుదరదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టుకు తెలిపారు.

స్పీకర్‌ నిష్ర్కియాపరత్వంపై న్యాయసమీక్ష చేయొచ్చు!

  • అనర్హత పిటిషన్లపై కోర్టు జోక్యం చేసుకోవచ్చు

  • పార్టీ మారిన ఎమ్మెల్యేలు పదవుల్లో ఉండడానికి అనర్హులు

  • హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాదన

  • ‘3 నెలల్లో తేల్చాలి’ అని సుప్రీం చెప్పలేదు

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెల్లం, కడియం

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ప్రకారం స్పీకర్‌ తన ఎదుట ఉన్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా చూస్తూ ఊరికే ఉంటానంటే కుదరదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టుకు తెలిపారు. స్పీకర్‌ నిష్ర్కియాపరత్వంపై అన్ని దశల్లోనూ న్యాయ సమీక్ష చేపట్టవచ్చని.. అందులో భాగంగానే సింగిల్‌ జడ్జి సరైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి, కాంగ్రె్‌సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా, దానిపై నిర్ణయం తీసుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం.. అనర్హత పిటిషన్ల విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్‌ ఇవ్వాలని, వాటిని స్పీకర్‌ ఎదుట ఉంచాలని.. ఎలాంటి విచారణ ప్రారంభం కాకపోతే సూమోటోగా కేసులను మళ్లీ తెరుస్తామని పేర్కొంది.

ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు స్పీకర్‌ను బెదిరించేలా ఉందని.. స్పీకర్‌ అధికారాలపై న్యాయ సమీక్షకు అవకాశం లేదని పేర్కొంటూ అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో అప్పీళ్లు దాఖలు చేశారు. వాటిపై చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరఫున గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. ‘‘స్పీకర్‌ తన ఎదుట పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లను పరిష్కరించకుండా ఐదేళ్లు గడిపేస్తానంటే కుదరదు. వీలైనంత వేగంగా వాటిని విచారించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కైశం మేఘాచంద్రసింగ్‌ తీర్పులో తగిన సమయం అంటే మూడు నెలలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.


స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడానికి ముందు, తర్వాత కూడా న్యాయ సమీక్షకు అవకాశం ఉంది. స్పీకర్‌ చర్యలపై అన్ని దశల్లోనూ కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. మరోవైపు అసెంబ్లీ కార్యదర్శికి ఈ అప్పీళ్లు దాఖలు చేసే అర్హత లేదు. సుప్రీం తీర్పు ఆధారంగానే సింగిల్‌ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా పదవుల్లో కొనసాగడానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు. తెల్లం, కడియం తరఫున సీనియర్‌ న్యాయవాదులు దేశాయి ప్రకాశ్‌రెడ్డి, మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘స్పీకర్‌ అధికారాలకు సంబంధించి ‘కిహోటో హోలోహాన్‌’ తీర్పు ఇప్పటికీ శిరోధార్యంగా ఉంది. స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎలాంటి న్యాయసమీక్షకు అవకాశం లేదు. స్పీకర్‌ తుది తీర్పు ఇచ్చిన తర్వాతే పరిమిత స్థాయిలో న్యాయసమీక్షకు అవకాశం ఉంటుంది. మూడు నెలల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలన్న విషయాన్ని ఇటీవలి ‘సుభాష్‌ దేశాయి’ తీర్పు ధ్రువీకరించలేదు. వీలైనంత వేగంగా అని మాత్రమే సుప్రీంకోర్టు పేర్కొంది. స్పీకర్‌కు నిర్ణీత షెడ్యూల్‌ అంటే ఏదీ ఉండదు’’ అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాదనలు ముగియకపోవడంతో తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

Updated Date - Nov 08 , 2024 | 03:38 AM