Share News

Building Collapse: ఒరిగిన భవనం.. వణికిన జనం!

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:58 AM

ఉన్నట్టుండి కాళ్ల కింద నేల కదిలినట్టు అనిపిస్తే? ఆ ఐదు అంతస్తుల భవనంలో ఉంటున్న వారు ఒక్కసారిగా అలానే ఫీలయ్యారు! దిగ్ర్భాంతి నుంచి తేరుకొని తామున్న భవనం ఓ వైపు ఒరుగుతున్నట్టు గుర్తించి కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు!

Building Collapse: ఒరిగిన భవనం.. వణికిన జనం!

  • పక్కన సెల్లార్‌ తవ్వడంతో కదిలిన పిల్లర్లు.. 50 గజాల్లో 4 అంతస్తులు, పెంట్‌హౌజ్‌ నిర్మాణం

  • హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో భవనం కూల్చివేత

  • భవన యజమానులైన దంపతులు, పక్కన సెల్లార్‌ తవ్విన వ్యక్తిపై కేసులు

గచ్చిబౌలి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉన్నట్టుండి కాళ్ల కింద నేల కదిలినట్టు అనిపిస్తే? ఆ ఐదు అంతస్తుల భవనంలో ఉంటున్న వారు ఒక్కసారిగా అలానే ఫీలయ్యారు! దిగ్ర్భాంతి నుంచి తేరుకొని తామున్న భవనం ఓ వైపు ఒరుగుతున్నట్టు గుర్తించి కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు! శేరిలింగంపల్లి సర్కిల్‌ కొండాపూర్‌ పరిధిలోని సిద్ధిక్‌నగర్‌లో మంగళవారం రాత్రి 8:30కు ఈ ఘటన జరిగింది. పక్కనే ఎలాంటి అనుమతుల్లేకుండా సెల్లార్‌ తవ్వడంతో పిల్లర్లపై ప్రభావం పడి భవనం ఒరిగింది. ఈ భవనాన్ని 50 గజాల స్థలంలో నిర్మించి అద్దెకిచ్చారు. ఈ భవనంలో తొమ్మిది కుటుంబాలు ఉంటున్నాయి. మంగళవారం రాత్రి భవనం ఒరిగిన సమయంలో లోపల 35మంది ఉండగా.. కట్టుబట్టలతో బయటకు పరుగులు తీశారు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న అధికారులు చుట్టుపక్కల 20 భవనాల్లో ఉన్న వారిని కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బుధవారం ఉదయం 10గంటలకుభారీ బందోబస్తు మధ్య హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు హైడ్రాలిక్‌ యంత్రంతో కూల్చివేతలు ప్రారంభించారు. మధ్యలో యంత్రంలో సాంకేతిక లోపం తలెత్తి పనులు ఆగినా రాత్రి 9 గంటల వరకు భవనాన్ని నేలమట్టం చేశారు.


ఘటనా స్థలానికి పీఏసీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి చేరుకుని పరిశీలించారు. కాగా, భవనం పక్కనే సెల్లార్‌ తవ్వింది ఆ స్థల యాజమాని యాస్మిన్‌ అని గుర్తించారు. అతడు కుటుంబసభ్యులతో సహా పరారీలో ఉన్నాడు. అతడిపైనా.. 50గజాల స్థలంలో నాలుగు అంతస్తులు, ఓ పెంట్‌ హౌజ్‌ నిర్మించిన భవన యజమానులు లక్ష్మణ్‌-స్వప్న దంపతులపైనా పోలీసులకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసులు నమోదయ్యాయి. సిద్ధిక్‌నగర్‌లో భవనం ఓ వైపు ఒరగడంతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పూర్తిగా కూల్చే వరకు ఖాళీ చేసిన ఇళ్లలోకి వారిని పంపే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెప్పడంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు తిండి తిప్పలు లేకుండా, చలిగాలిలో కాలం వెళ్లదీశారు. కాగా 50, 100 గజాల స్థలాల్లో భారీ భవనాలు నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు.


  • నగదు, బంగారం తెచ్చుకుంటామన్నా..

కుంగిన భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న అంజన సర్దార్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. భవనంలో భర్త, ఇద్దరు కుమారులతో ఆమె నివాసం ఉంటుంది. భవనంలో ఏడాది నుంచి నివాసం ఉంటున్నామని ఆమె చెప్పింది. బంగారం, నగదు, ఫోన్లు ఇంట్లోనే ఉండిపోయానని, తెచ్చుకుంటామని ఆమె పోలీసులను వేడుకుంది. మూడో అంతస్తులో అసోంకు చెందిన సరిముల్లాహలం, నూర్‌ అహ్మద్‌ ఉంటున్నారు. లోపల తమ విలువైన వస్తువులు, టెన్త్‌, ఇంటర్‌కు సంబంధించిన ఒర్జినల్‌ సర్టిఫికెట్లు, పాన్‌, ఆధార్‌ ఉన్నాయని తెచ్చుకుంటామని పోలీసులను వేడుకున్నారు. అయితే ఎవ్వరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు.

Updated Date - Nov 21 , 2024 | 04:58 AM