Share News

Hyderabad: 14 రకాల వివరాలివ్వండి..

ABN , Publish Date - Nov 15 , 2024 | 04:47 AM

కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌).. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లెక్కలు తీసే పనిలో పడింది. ఈ పథకంపై గత మే 31న కాగ్‌ ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి పంపించింది. తుది నివేదికను సిద్ధం చేయడానికి ముందు పలు మార్లు ముసాయిదా నివేదికలు ప్రభుత్వానికి అందిస్తుంది.

Hyderabad: 14 రకాల వివరాలివ్వండి..

  • పాలమూరు ఎత్తిపోతలపై కాగ్‌ లేఖ మే 31నే ప్రభుత్వానికి ముసాయిదా

  • అక్టోబరు 15న జవాబులిచ్చిన సర్కారు మరిన్ని వివరాలు కోరిన కాగ్‌

  • మరిన్ని వివరాలు కోరుతూ నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌).. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లెక్కలు తీసే పనిలో పడింది. ఈ పథకంపై గత మే 31న కాగ్‌ ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి పంపించింది. తుది నివేదికను సిద్ధం చేయడానికి ముందు పలు మార్లు ముసాయిదా నివేదికలు ప్రభుత్వానికి అందిస్తుంది. వాటికి జవాబులు తెప్పించుకోవడం, సరిచేయడం వంటి పనుల తర్వాత తుది నివేదికను ఖరారు చేస్తుంది. గత మే 31న కాగ్‌ అందించిన ము సాయిదాపై ప్రభుత్వం అక్టోబరు 15న అంశాలవారీగా బదులిచ్చింది. వాటిని నిశితంగా పరిశీలించిన అనంతరం అదనంగా 14 రకాల వివరాలు కోరుతూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు గురువారం లేఖ రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల జలాశయం నుంచి నీటిని తరలించడానికి వీలుగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రీ-ఇంజనీరింగ్‌ చేసి శ్రీశైలం నుంచి నీటిని తరలించేలా డిజైన్‌ను మార్చి, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టులో ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌ తప్ప మిగిలిన రిజర్వాయర్ల పనులు దాదాపుగా పూర్తయ్యాయి.


గత ఏడాది సెప్టెంబరు 16న ప్రభుత్వం నార్లాపూర్‌లో ఒక మోటార్‌ను ట్రయల్‌ రన్‌ చేపట్టింది. రూ.52 వేల కోట్లకు పైగా వ్యయంతో దీన్ని చేపడుతుండగా.. ఇప్పటిదాకా రూ.26738 కోట్లు వెచ్చించారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధుల లేమితో దీనిపై దృష్టి సారించలేదు. తాజాగా కాగ్‌ ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్ర నీటిపారుదల ప్రణాళిక, రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ అనంతరం నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు, ఎప్పట్లో వీటిని ప్రారంభించారు? ప్రాజెక్టుల డీపీఆర్‌ల తయారీ బాధ్యతలను ఏ ఏజెన్సీలకు అప్పగించారు? టెండర్లు పిలిచారా? 2024 మార్చి నాటికి ప్యాకేజీల వారీగా ఆర్థిక, పనుల పురోగతి ఏ మేరకు ఉంది? పునరావాసం, పునర్నిర్మాణం ఏ దశలో ఉంది? ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంఘం అనుమతులు వచ్చాయా? కృష్ణా నది యాజమాన్య బోర్డు డీపీఆర్‌ను పరిశీలించిందా? ఒక టీఎంసీ నీటితో ఏ మేరకు సాగుకు నీళ్లు ఇవ్వనున్నారు? డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే ఏ మేరకు పనుల పురోగతి ఉందో ప్యాకేజీల వారీగా వివరాలు, వాస్తవిక అంచనా వ్యయం, సవరించిన అంచనా వ్యయం ఎంత? సవరిస్తే కారణాలేంటి? జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఉత్తర్వుల కారణంగా మధ్యలో పనులు నిలిపివేసిన ప్రాజెక్టులు ఉన్నాయా? వంటి వివరాలను అందించాలని కోరింది.

Updated Date - Nov 15 , 2024 | 04:47 AM