Share News

Supreme Court: గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలి

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:21 AM

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Supreme Court: గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేయాలి

  • జీవో 29ని రద్దు చేయాలి

  • సుప్రీం కోర్టులో గ్రూప్‌-1 అభ్యర్థి పిటిషన్‌

  • సోమవారం విచారిస్తాం: సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ పోగుల రాంబాబు అనే అభ్యర్థి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవోతో తాము నష్టపోతున్నామంటూ గురువారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. గ్రూప్‌ -1 నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు పిటిషనర్‌ తరఫున న్యాయవాది మోహిత్‌ రావు శుక్రవారం ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని కోరారు. అయితే.. తక్షణమే విచారించలేమని, సోమవారం (ఈనెల 21న) విచారిస్తామని సీజేఐ స్పష్టం చేశారు.


  • జీవో 29ను రద్దు చేయాలి: అభ్యర్థులు

రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్‌ 1 అభ్యర్థులు శ్రీనివాస్‌, అర్జున్‌, ఇందిరా నాయక్‌, రామ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్‌ 1 అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని, మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా తమకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమకు న్యాయం దక్కుతుందన్న నమ్మకంతో సుప్రీం కోర్టును ఆశ్రయించామని, జీవో 29ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

Updated Date - Oct 19 , 2024 | 03:21 AM