Share News

వీవోఏను తొలగించినందుకు కలెక్టర్‌పై కేసు!

ABN , Publish Date - Dec 26 , 2024 | 03:37 AM

గ్రామైఖ్య సంఘాల సహాయకురాలి (వీవోఏ)ని అకారణంగా విధుల నుంచి తొలగించినందుకు జనగామ జిల్లా పూర్వ కలెక్టర్‌ సహా 12 మంది అధికారులపై కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వీవోఏను తొలగించినందుకు కలెక్టర్‌పై కేసు!

  • మరో 11 మంది అధికారులపై కూడా..

  • జనగామ కోర్టు ఆదేశాలతో నమోదు

స్టేషన్‌ఘన్‌పూర్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రామైఖ్య సంఘాల సహాయకురాలి (వీవోఏ)ని అకారణంగా విధుల నుంచి తొలగించినందుకు జనగామ జిల్లా పూర్వ కలెక్టర్‌ సహా 12 మంది అధికారులపై కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తేల్చిన జనగామ కోర్టు వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఆదేశాలిచ్చింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండకు చెందిన వీవోఏ చాడ సునీతపై 2020-21లో అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ ఆరోపణలు అవాస్తవమని అధికారులకు మొర పెట్టుకుంది. అప్పటి కలెక్టర్‌ శివలింగయ్య వరకు వెళ్లినా పట్టించుకోకపోగా.. వీవోఏ విధుల నుంచి సునీతను తప్పించారు.


అయితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమంటూ ఆమె కొన్ని నెలల క్రితం కోర్టును అశ్రయించింది. దీంతో కోర్టు మహోదయ గ్రామైఖ్య సంఘానికి సంబంధించిన రికార్డులను పరిశీలించింది. అందులో ఆమె ఏ అక్రమాలకు పాల్పడలేదని గుర్తించింది. అకారణంగా సునీతను వీవోఏగా తొలగించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై కేసులు నమోదు చేయాలని ఘన్‌పూర్‌ పోలీసులకు కోర్టు ఈనెల 22న ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు 12 మంది అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వారిలో అప్పటి కలెక్టర్‌ శివలింగయ్య, డీఆర్‌డీవో రాంరెడ్డి, అదనపు కలెక్టర్‌ హమీద్‌ అన్సారి, ఏపీడీ నూరొద్దీన్‌, ఏపీఎం కవిత, డీపీఎం సమ్మక్క, డీపీఎం వరలక్ష్మి, గోవర్ధన్‌, ఆనందం, పూర్ణచందర్‌, బానోతు రాములు, ఎలేందర్‌ ఉన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 03:37 AM