Share News

railway project: అమరావతికి రైలు మార్గం

ABN , Publish Date - Oct 25 , 2024 | 03:54 AM

అమరావతి 2.0. ఆరంభంలోనే కేంద్రం శుభవార్త చెప్పింది. రాజధాని అమరావతి రైలుమార్గానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 2,245 కోట్లు మంజూరు చేసింది.

railway project: అమరావతికి రైలు మార్గం

  • ఎర్రుపాలెం-నంబూరు మధ్య 57కి.మీ మార్గం.. 2,245కోట్లతో ఆమోదించిన కేంద్రం

న్యూఢిల్లీ, గుంటూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అమరావతి 2.0. ఆరంభంలోనే కేంద్రం శుభవార్త చెప్పింది. రాజధాని అమరావతి రైలుమార్గానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 2,245 కోట్లు మంజూరు చేసింది. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం రైల్వే నిలయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌....కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివా్‌సతో కలిసి తెలుగు మీడియాతో మాట్లాడారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలతో మాట్లాడారు. రాబోయే నాలుగేళ్లలో అమరావతి రైలు మార్గాన్ని పూర్తిచేస్తామని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.


‘‘అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు. అందుకే.. ఈ నగరాన్ని రైల్వేతో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నవ్యాంధ్ర తొలి సీఎంగా అప్పట్లోనే చంద్రబాబు.. అమరావతికి కొత్త రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అది ఇప్పుడు, కూటమి ప్రభుత్వంలో సాకారం అవుతోంది’’ అని పేర్కొన్నారు. ఈ రైలుమార్గం నిర్మాణంతో అమరావతికి దేశంలోని అన్ని రాష్ట్రాలతో కనెక్టివిటి వస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి, రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను పురోగతిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు సమీక్షలు నిర్వహించారు. కేంద్ర రైల్వేమంత్రితో అనేక దఫాలు చర్చించారు. వీటన్నింటి ఫలితంగా అమరావతి మీదుగా ఎర్రుపాలెం - నంబూరు మధ్య నూతన రైలుమార్గాన్ని కేంద్ర కేబినెట్‌ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున ఈ రైలుమార్గం నిర్మాణం జరగనుంది. దీని వలన 19 లక్షల మానవ పనిదినాలు జనరేట్‌ అవుతాయని, ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు.


  • కొండపల్లికి మినహాయింపు

ఖమ్మం జిల్లా మధిరలోని ఎర్రుపాలెం - నంబూరు (అమరావతి) రైలుమార్గంలో కొండపల్లి రిజర్వు అటవీ ప్రాంతం కలవకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. పరిటాల వద్ద మల్టీమోడల్‌ కార్గో టెర్మినల్‌ నిర్మిస్తామని, దీని వల్ల సరుకు రవాణాకు అదొక హబ్‌గా మారుతుందన్నారు. పర్యావరణహితంగా ఈ రైలుమార్గం నిర్మాణం చేస్తారు.


  • కృష్ణానదిపై వంతెన నిర్మాణం

అమరావతి రైలుమార్గంలో 3.2 కిలోమీటర్ల పొడవున కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారు. కొత్తపల్లి - వడ్డమాను గ్రామాల మధ్య దీనిని ఏర్పాటు చేస్తారు. హౌరా - చెన్నై మార్గంలో ఇప్పటికే ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా మరొక బ్రిడ్జి అందుబాటులోకి వస్తుంది. ఇది ఎంతో క్లిష్టమైన పని అయినప్పటికీ రైలుమార్గంతో పాటే బ్రిడ్జీ నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి పేర్కొన్నారు.


  • ఇతర రైలుమార్గాలతో సంధానం..

హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా వంటి పెద్ద నగరాలతో అనుసంధానిస్తూ అమరావతి రైల్వే ప్రాజెక్టును చేపట్టనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను కలుపుతూ రైల్వే లైను నిర్మాణం చేయనున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మరింత ప్రయాణ సౌకర్యం కలగడంతోపాటు పారిశ్రామికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. నంబూరు రైల్వేస్టేషన్‌ విజయవాడ - గుంటూరు/న్యూగుంటూరు సెక్షన్‌లో ఉన్నది. అలానే ఎర్రుపాలెం రైల్వేస్టేషన్‌ విజయవాడ - ఖమ్మం సెక్షన్‌లో ఉంది. విజయవాడ - ఖమ్మం సెక్షన్‌ నుంచి బలార్ష, ఇటార్సీ, నాగ్‌పూర్‌, భోపాల్‌, ఢిల్లీకి కొత్త రైల్వే లైన్‌ అనుసంఽధానం అయి ఉంటుంది. అంతేకాకుండా అటు గుజరాత్‌ వైపునకు, ఇటు ఉత్తర్‌ప్రదేశ్‌కు కూడా ఈ మార్గంతో కనెక్టివిటీ ఉంది. నంబూరు రైల్వేస్టేషన్‌ నుంచి గుంటూరు మీదగా సికింద్రాబాద్‌, బెంగళూరుకు కనెక్టివిటీ ఉంది. న్యూగుంటూరు మీదగా తెనాలి నుంచి చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, కన్యాకుమారికి కూడా కనెక్టివిటీ ఉంది. దక్షిణ, మధ్య, ఉత్తర భారత్‌తో అనుసంధానం మరింత సులువు కానుంది. అమరావతిలో పరిశ్రమలు నెలకొల్పడానికి, ప్రజల రవాణాకు దోహదపడుతుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.


  • బాబు సాధించే వరకు ఊరుకోరు:అశ్వనీ వైష్ణవ్‌

అమరావతికి చల్లని కబురు చెప్పడానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌ చివరిలో నేతల మధ్య సరదా సంభాషణ సాగింది. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. అశ్వినీ వైష్ణవ్‌ రైల్వేమంత్రిగానే కాకుండా.. ఐటీ మంత్రిగా కూడా తనను తాను నిరూపించుకున్నారని, అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారని చమత్కరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ... ఒరిజినల్‌ ఐటీ మ్యాన్‌ చంద్రబాబు నాయుడని కొనియాడారు. విజనరీ ఉన్న వ్యక్తిగా బాబును అభివర్ణించారు. ‘‘రైల్వే ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు అన్నారు కదా? సాధ్యమేనా’’ అని అశ్వినీ వైష్ణవ్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చంద్రబాబు అనుకుంటే సాధించే వరకు ఊరుకోరని నవ్వుతూ సమాధానమిచ్చారు.

Updated Date - Oct 25 , 2024 | 03:54 AM