Navodaya Vidyalayas: తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు
ABN , Publish Date - Dec 07 , 2024 | 02:59 AM
దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మహబూబ్‌నగర్, నిజామాబాద్, సూర్యాపేట సహా 4 జిల్లాలకు మంజూరు
ఆంధ్రప్రదేశ్‌కు 8 కేంద్రీయ విద్యాలయాలు.. కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు (కేవీ), 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కొత్త కేవీల ద్వారా దేశవ్యాప్తంగా 82 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందనుందన్నారు.
రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో నవోదయ విద్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. 85 కొత్త కేవీల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ఒక కేవీ విస్తరణకు 2025-26 నుంచి ఎనిమిదేళ్ల కాలానికి రూ.5,872.08 కోట్లు, 2024-25 నుంచి ఐదేళ్ల కాలానికి 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు రూ.2,359.82 కోట్ల నిధులు అవసరమవుతాయని క్యాబినెట్ అంచనా వేసింది.