Share News

SBI: ఎస్బీఐ నూతన ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

ABN , Publish Date - Jun 30 , 2024 | 03:53 PM

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నూతన ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి(Challa Sreenivasulu Setty) నియమితులవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ పార్టీల నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

SBI: ఎస్బీఐ నూతన ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

హైదరాబాద్: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నూతన ఛైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి(Challa Sreenivasulu Setty) నియమితులవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ పార్టీల నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఎస్బీఐలో అత్యున్నత పదవి చేపట్టబోతున్న శ్రీనివాసులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) శుభాకాంక్షలు తెలిపారు. "దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) నూతన చైర్మన్‌గా నియమితులవుతున్న తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్‌ శెట్టి)కి హార్ధిక శుభాకాంక్షలు"అని ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు.


నేపథ్యం ఇదే..

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలంలోని పెద్ద పోతులపాడు శ్రీనివాసులు శెట్టి స్వగ్రామం. ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే ఆయన విద్యాభ్యాసం జరిగింది. ఎనిమిది నుంచి పదో తరగతి, ఇంటర్‌ గద్వాలలో పూర్తి చేశారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. చిన్న వయసులోనే తండ్రి కిరాణా షాపులో గ్రామస్థులు తీసుకున్న అప్పులు వసూలు చేసేవారు.

ఈ అప్పుల వసూళ్ల అనుభవం ఎస్‌బీఐలో మొండి బకాయిల వసూళ్లలోనూ ఉపయోగపడిందని ఆయన చెబుతారు. 1988లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరిన శెట్టి.. గత మూడున్నర దశాబ్దాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. కార్పొరేట్‌ క్రెడిట్‌, రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌, రుణాల వసూళ్లు, ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ రంగాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది.


శెట్టి ప్రస్తుతం ఎస్‌బీఐ ఎండీగా ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌, గ్లోబల్‌ మార్కెట్స్‌, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఎస్‌బీఐ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ద్వారా స్వగ్రామం పెద్ద పోతులపాడు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీకి రూ.40 లక్షల విలువ చేసే సామాగ్రిని అందజేయగా.. అంతక్రితం ఊరూరా తిరిగి రోగులకు ఔషధాలు అందించే ఎస్‌బీఐ సంజీవని వాహనాన్ని డొనేట్‌ చేశారు. శ్రీనివాసులు శెట్టికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు కెనడాలో, మరొకరు ముంబైలో స్థిరపడ్డారు.

For Latest News and National News click here

Updated Date - Jun 30 , 2024 | 03:53 PM