Share News

CM Relief Fund: సీఎంఆర్‌ఎఫ్‌ స్వాహా..

ABN , Publish Date - Aug 27 , 2024 | 04:38 AM

వైద్యం చేయకుండానే ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) సొమ్ము స్వాహా చేశారన్న ఆరోపణలపై మొత్తం 30 ఆస్పత్రులపై సీఐడీ అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది.

CM Relief Fund: సీఎంఆర్‌ఎఫ్‌ స్వాహా..

  • 30 ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు!.. సీఐడీ విచారణ వేగవంతం

  • చిన్న క్లినిక్‌లలోనూ పెద్ద సర్జరీలు.. వైద్యుడు, రోగి లేకున్నా కేస్‌ షీట్లు

  • అనుమానం రాకుండా బిల్లులు.. ఒక్కోటిగా బయటపడుతున్న బాగోతాలు

  • నిధులు జమయిన ఖాతాలపై దృష్టి.. సహకరించిన అధికారులపైనా ఆరాజూ 30 ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు!.. సీఐడీ విచారణ వేగవంతం

  • చిన్న క్లినిక్‌లలోనూ పెద్ద సర్జరీలు.. వైద్యుడు, రోగి లేకున్నా కేస్‌ షీట్లు

  • అనుమానం రాకుండా బిల్లులు.. ఒక్కోటిగా బయటపడుతున్న బాగోతాలు

  • నిధులు జమయిన ఖాతాలపై దృష్టి.. సహకరించిన అధికారులపైనా ఆరా

కరీంనగర్‌ క్రైం/మిర్యాలగూడ అర్బన్‌/హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): వైద్యం చేయకుండానే ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) సొమ్ము స్వాహా చేశారన్న ఆరోపణలపై మొత్తం 30 ఆస్పత్రులపై సీఐడీ అధికారులు క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ఆయా ఆస్పత్రులు అక్రమంగా సీఎంఆర్‌ఎఫ్‌ పొందినట్లు గుర్తించిన అధికారులు.. రెండు, మూడు రోజులుగా కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూడు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని నాలుగు ప్రైవేట్‌ ఆస్పత్రులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం.


ఈ మేరకు అధికారుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి సీఎంఆర్‌ఎఫ్‌ స్వాహా చేశారన్న ఆరోపణలపై గత ఏడాది ఏప్రిల్‌లో సెంట్రల్‌ క్రైం స్టేషన్‌(సీసీఎ్‌స) పోలీసులు విచారణ చేపట్టారు. అప్పట్లోనే కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నా.. రాజకీయ ఒత్తిళ్లతో వదిలేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో అధికారులు సైతం సంబంధిత ఫైల్‌ను పక్కనపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి వచ్చాక అప్పటి అక్రమాల లెక్క తేల్చాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నేర పరిశోధన శాఖ (సీఐడీ) రంగ ప్రవేశం చేసి క్షుణ్ణంగా విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా.. ఆయా ఆస్పత్రుల బయట బోర్డులపై ఉండే వైద్యుల పేర్లను వాడుకొని.. నిందితులు ఈ గోల్‌మాల్‌కు తెర లేపినట్లు తెలిసింది.


ఏ మాత్రం అనుమానం రాకుం డా నకిలీ బిల్లులు సృష్టించి, లక్షలాది రూపాయలు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. సీఎంఆర్‌ఎ్‌ఫకు దరఖాస్తు చేసుకున్న పత్రాల్లో పేర్కొన్న ఆస్పత్రి పేరు, చిరునామా తమదే అయినప్పటికీ అందులో చికిత్స అందించిన పేర్కొన్న వైద్యుడు ఎవరో తమకు తెలియదని, ఆ పేరుతో తమ ఆస్పత్రిలో ఎవరూ పని చేయట్లేదని దర్యాప్తు అధికారులకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రి రికార్డుల్లోని ఇన్‌పేషెంట్‌ నంబర్లతో సంబంధం లేని వ్యక్తులు సీఎంఆర్‌ఎ్‌ఫకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అదే సమయంలో చిన్న చిన్న క్లినిక్‌ల్లోనూ శస్త్రచికిత్సలు చేసినట్లు బిల్లులు సృష్టించి, నిధులు డ్రా చేసుకున్నట్లు సీఐడీ గుర్తించింది.


ఒకటి, రెండు మూత పడిన ఆస్పత్రుల పేరుతోనూ సీఎంఆర్‌ఎ్‌ఫకు దరఖాస్తులు వచ్చినట్లు తేలింది. తమ ప్రమేయం లేకుండానే కేస్‌ షీట్లు, మెడికల్‌ బిల్లులు ఎలా వచ్చాయో తెలియడం లేదని ఆస్పత్రులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం కళ్లుగప్పి సిబ్బంది ఎవరైనా బిల్లులు సృష్టించారా? ఎవరి ప్రాత ఎంత అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మరోవైపు.. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందుకున్న తర్వాత నిధులు జమ అయిన బ్యాంకు ఖాతాలపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. రోగి ఆస్పత్రిలో చేరిన తేదీ, ఆపరేషన్‌ లేదా చికిత్స చేసిన తేదీ, డిశ్చార్జి అయిన తేదీ, సీఎంఆర్‌ఎ్‌ఫకు దరఖాస్తు చేసుకున్న తేదీ, నిధులు మంజూరైన తేదీ... ఇలా ప్రతి అంశంపైనా ఆరా తీస్తున్నారు.


ప్రాథమికంగా పరిశీలించిన కొన్నింటిలో వైద్యం చేయించుకున్న తేదీకి సీఎంఆర్‌ఎ్‌ఫకు దరఖాస్తు చేసుకున్న తేదీకి మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉండగా... నిధుల విడుదల మాత్రం తక్కువ సమయంలో జరిగినట్లు సీఐడీ దర్యాప్తులోబహిర్గతమైంది. శస్త్రచికిత్సల వివరాల నుంచి నకిలీ బిల్లుల తయారీ దాకా, దరఖాస్తు నుంచి ఆర్థిక సహాయం పొందే దాకా ప్రతి దశలో ఎక్కడిక్కడ ఈ ముఠాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సహకరించారా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఐడీ అధికారులు విచారణ చేపట్టగా.. చాలా బిల్లులు నకిలీవని తేలినట్లు సమాచారం. కొన్ని కేసుల్లో వైద్యం కూడా పొందలేదని, వారి పేరిట వచ్చిన సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లులో లబ్ధిదారులకు కొంత డబ్బులు అందజేసిన మధ్యవర్తులు మిగతా సొమ్ము కాజేసినట్లు తెలిసింది. మిర్యాలగూడలో మహేశ్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పేరును నాలుగేళ్ల వ్యవధిలో మూడు సార్లు మార్చడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వేరే పేరిట ఉన్న ఈ ఆస్పత్రికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద నిధులు ఏమైనా అందాయా? అన్న కోణంలోనూ విచారణ సాగుతతోంది.

Updated Date - Aug 27 , 2024 | 04:38 AM