Share News

Bhadradri-Kothagudem: మళ్లీ పేలిన తూటా..

ABN , Publish Date - Sep 06 , 2024 | 04:47 AM

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా మరోమారు ఎరుపెక్కింది. కరకగూడెం మండల పరిధిలో రఘునాఽథపాలెం పంచాయతీ మోతె గ్రామ సమీపంలో బోనాలకుంట అడవిలో తుపాకీ తూటా పేలింది.

Bhadradri-Kothagudem: మళ్లీ పేలిన తూటా..

  • భద్రాద్రి జిల్లా బోనాలగుంట అడవిలో భారీ

  • ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టుల మృతి

  • ఇద్దరు గ్రేహౌండ్స్‌ పోలీసులకు గాయాలు

  • టేకులగూడెంలో మావోయిస్టు నేత జగన్‌

  • అంత్యక్రియలు పూర్తి.. భారీ ఎత్తున ప్రజలు

కరకగూడెం/మణుగూరు/కొత్తగూడెం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా మరోమారు ఎరుపెక్కింది. కరకగూడెం మండల పరిధిలో రఘునాఽథపాలెం పంచాయతీ మోతె గ్రామ సమీపంలో బోనాలకుంట అడవిలో తుపాకీ తూటా పేలింది. గురువారం తెల్లవారుజామున కూంబింగ్‌లో ఉన్న గ్రేహౌండ్స్‌ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు జిల్లాలడివిజన్‌ కమిటీ చెందిన ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు గ్రేహౌండ్స్‌ పోలీసులు-- వంశీ, సందీప్‌ సైతం ఎదురుకాల్పుల్లో గాయపడ్డారు. వీరిద్దరినీ భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.


ఈ కాల్పుల నుంచి మాసయ్య అనే మావోయిస్టు దళ సభ్యుడు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతణ్ని పట్టుకునేందుకు గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ‘‘ఇరువర్గాల మధ్య గంట పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాక.. గ్రేహౌండ్స్‌ దళాలు గాలింపు చేపట్టాయి. అక్కడ ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి’’ అని పోలీసులు వివరించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ మణుగూరు డివిజన్‌ ఏరియా కార్యదర్శి, ఛత్తీ్‌సగఢ్‌లోని సుకుమా జిల్లా రాయగూడెంకు చెందిన లచ్చన్న అలియాస్‌ కుంజా వీరయ్య, ఛత్తీ్‌సగఢ్‌లోని కంబాడుకు చెందిన ఆయన భార్య పూనెం తులసి, ఏపీలోని జగ్గారం గ్రామానికి చెందిన మణుగూరు ఏరియా దళ కమాండర్‌ రాము, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన గంగాల్‌, దుర్గేశ్‌, కోసీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


ఈ ఆరుగురిపై భారీగా రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఘటనాస్థలి నుంచి రెండు ఏకే 47, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక 303 రైఫిల్‌, ఒక ఫిస్టల్‌, వీటి మేగజీన్లు, లైవ్‌ రౌండ్లు, కిట్‌బ్యాగులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. స్పెషల్‌ పార్టీ పోలీసులకు అందిన సమాచారం మేరకు గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా.. తెల్లవారుజామునే హోరాహోరీ కాల్పులతో అడవి దద్దరిల్లింది. ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఘటనాస్థలిని ఎస్పీ రోహిత్‌రాజ్‌, కొత్తగూడెం ఓఎస్డీ పంకజ్‌ పరితోష్‌ పరిశీలించారు. కరకగూడెం ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఉదయం ఘటనను కవర్‌ చేసేందుకు వెళ్లిన మీడియాను పోలీసులు అడ్డుకున్నారు.


  • విప్లవ ద్రోహుల పనే: మావోయిస్టు పార్టీ

హైదరాబాద్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): రఘునాథ పాలెం ఎన్‌కౌంటర్‌ విప్లవ ద్రోహులు అందించిన సమాచారంతో జరిగిందని మావోయిస్టు పార్టీ భద్రాది కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్‌ కమిటీ ఆరోపించింది. ఈ మేరకు ఆజాద్‌ పేరుతో గురువారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ ఎన్‌కౌంటర్‌కు కాంగ్రెస్‌ పార్టీ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9న జిల్లా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించింది.


  • జగన్‌ది కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటరే: ప్రజాసంఘాలు

కాజీపేట, సెప్టెంబరు 5: ఛత్తీ్‌సగఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు నేత జగన్‌ అలియాస్‌ రణదేవ్‌ దాదా అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమమైన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలో పూర్తయ్యాయి. బంధువులు, గ్రామస్థులు, రాజకీయ, ప్రజా, పౌరహక్కుల నాయకులు, మావోయిస్టు సానుభూతిపరులు భారీగా తరలివచ్చి, ఏసోబుకు నివాళులర్పించారు. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్‌ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్‌, దాస్యం వినయ్‌భాస్కర్‌, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య కూడా టేగులగూడెం చేరుకుని ఏసోబుకు నివాళులర్పించారు.


అంతిమయాత్రకు హాజరైన మాజీ మావోయిస్టు భారతక్క, మావోయిస్టు బంధుమిత్రుల కమిటీ సహాయ కార్యదర్శి శాంతక్క, పౌరహక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ జనగామ జిల్లా అధ్యక్షుడు పాకాల వెంకన్న మీడియాతో మాట్లాడారు. ఏసోబుది కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటరేనని, ఈ ఎన్‌కౌంటర్‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 06 , 2024 | 04:47 AM