Share News

Adilabad: గుడిహత్నూర్‌లో పోలీసులపై దాడి

ABN , Publish Date - Dec 22 , 2024 | 03:39 AM

అదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది. గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో ఓ యువకుడు బాలికతో కలిసి ఉండగా స్థానికులు గదిలో బంధించారు.

Adilabad: గుడిహత్నూర్‌లో పోలీసులపై దాడి

  • యువకుడు బాలికతో ఉండగా బంధించిన స్థానికులు

  • అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి

  • ఇచ్చోడ సీఐ, ఎస్‌ఐ సహా పలువురికి గాయాలు

గుడిహత్నూర్‌, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి): అదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో పోలీసులపై దాడి ఘటన కలకలం రేపింది. గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో ఓ యువకుడు బాలికతో కలిసి ఉండగా స్థానికులు గదిలో బంధించారు. కూలీ పనులకు వెళ్లిన బాలిక తల్లిదండ్రులు ఇంట్లో తమ కుమార్తె లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బంధించిన యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువకుడిని తమకు అప్పగించాలని బాలిక తల్లిదండ్రులు, బంధువులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇచ్చోడ సీఐ భీమేష్‌, గుడిహత్నూర్‌ ఎస్సై మహేందర్‌తో పాటు పలువురు పోలీసులపై వారు దాడి చేశారు. ఘటనలో సీఐతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.


అంతటితో ఆగని బాలిక బంధువులు, స్థానికులు యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. చివరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గాయపడిన పోలీసులకు అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఉట్నూర్‌ డీఎస్పీ సీహెచ్‌ నాగేందర్‌, ఇచ్చోడ ఎస్సై తిరుపతి పరిశీలించారు.

Updated Date - Dec 22 , 2024 | 03:41 AM