Share News

Toopran: గురుకుల పాఠశాలలో మళ్లీ విద్యార్థుల మధ్య ఘర్షణ

ABN , Publish Date - Sep 02 , 2024 | 05:10 PM

మెదక్ జిల్లా తూప్రాన్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి 12.00 గంటలకు తొమ్మిదో తరగతి విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థులు ముకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి విషయాన్ని 9వ తరగతి విద్యార్థులు.. తమ తల్లిదండ్రులకు తెలిపారు.

Toopran: గురుకుల పాఠశాలలో మళ్లీ విద్యార్థుల మధ్య ఘర్షణ

మెదక్, సెప్టెంబర్ 02: మెదక్ జిల్లా తూప్రాన్ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి 12.00 గంటలకు తొమ్మిదో తరగతి విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థులు ముకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి విషయాన్ని 9వ తరగతి విద్యార్థులు.. తమ తల్లిదండ్రులకు తెలిపారు. సోమవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు రెసిడెన్షియల పాఠశాలకు చేరుకుని... ప్రిన్సిపాల్‌తో వాగ్వివాదానికి దిగారు.


పాఠశాలలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సరైన పర్యవేక్షణ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సందర్బంగా ఆరోపించారు. అందుకే ఈ తరహా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆవేదన చెందారు. ఇటీవల 10వ తరగతి విద్యార్థులపై కాలేజీ విద్యార్థులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ కొద్ది రోజులకే మరోసారి గురుకుల పాఠశాలలో ఘర్షణ చోటు చేసుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


గత జులైలో గురుకుల పాఠశాలలో జూనియర్లను గదిలో బంధించి వారిపై సీనియర్లు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో గురుకులంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు సైతం ఆరా తీశారు. ఈ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.


ఆ క్రమంలో పాఠశాల విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు మధ్య తరచుగా వివాదాలు నెలకొన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా నీటి సమస్య.. అంటే విద్యార్థులు బట్టలు ఉతుక్కునే సమయంలో చోటు చేసుకున్న స్వల్ప వివాదం కాస్తా ఇలా ఘర్షణలకు దారి తీస్తుందని పలువురు విద్యార్ధులు పేర్కొంటున్నారు. గురుకులంలో వార్డెన్ల నిర్లక్ష్య వైఖరి కూడా ఈ తరహా ఘటనలకు కారణమని ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 02 , 2024 | 05:10 PM