Share News

CM Chandrababu Naidu: తప్పు చేయలే!

ABN , Publish Date - Nov 17 , 2024 | 04:16 AM

గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి కేసు లేకున్నా, ఏ తప్పూ చేయకున్నా తనను అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తప్పు చేయలేదన్న ధైర్యంతోనే బలంగా నిలబడ్డానన్నారు.

CM Chandrababu Naidu: తప్పు చేయలే!

  • అందుకే ధైర్యంగా నిలబడ్డాను

  • ఏ కేసు లేకున్నా గత సర్కారు అరెస్టు చేసింది

  • ఏపీలో మేం గెలుస్తామని ముందే ఊహించా

  • దేశం కోసం మోదీతో కలిసి పనిచేస్తున్నాం

  • సోషల్‌ సైకోలకు అడ్డుకట్ట వేయాల్సిందే

  • లేదంటే భవిష్యత్తులో చాలా నష్టం

  • సంకీర్ణంలో చిన్నచిన్న సమస్యలు మామూలే

  • హిందూస్థాన్‌ టైమ్స్‌ సదస్సులో చంద్రబాబు

న్యూఢిల్లీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి కేసు లేకున్నా, ఏ తప్పూ చేయకున్నా తనను అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తప్పు చేయలేదన్న ధైర్యంతోనే బలంగా నిలబడ్డానన్నారు. గత ఎన్నికల్లో ఏపీలో కూటమి గెలుస్తుందని నూటికి నూరు శాతం ముందే ఊహించానని అన్నారు. ఓట్లు చీలిపోకూడదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ముందుకు వచ్చారని, ఆ తర్వాత బీజేపీ కూడా కూటమిలో చేరిందని చెప్పారు. దేశ భవిష్యత్‌ కోసం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. మోదీ హయాంలో భారతదేశం అగ్రరాజ్యంగా మారి తీరుతుందన్నారు. శనివారం ఢిల్లీలో హిందూస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తల్లి, చెల్లిపై ఆ పార్టీ నాయకులే సోషల్‌ మీడియాలో అత్యంత దారుణంగా, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్‌లో తీరని నష్టం జరుగుతుందన్నారు. హిందూస్థాన్‌ టైమ్స్‌ నేషనల్‌ పొలిటికల్‌ ఎడిటర్‌ సునేత్రా చౌదరి అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు ఇచ్చిన సమాధానాలివి.


  • జైలు జీవితం మనల్ని మార్చేస్తుందని చాలామంది అంటారు. మీరేమంటారు?

చంద్రబాబు: నా జీవిత కాలంలో మర్యాదల్ని, పద్ధతులను పాటించాను. చాలా క్రమశిక్షణతో ఉన్నా. ఎవరూ నన్ను వేలె త్తి చూపలేదు. కానీ, గత ప్రభుత్వంలో ఎలాంటి కేసు లేకుండా నన్ను అరెస్టు చేశారు. నా జీవితంలో ఇలాంటిది జరగకూడదని నేనెంత జాగ్రత్తగా ఉన్నా జరిగింది. నేను తప్పు చేయలేదు. అందుకే పూర్తి విశ్వాసంతో నిలబడ్డాను. 53 రోజుల జైలు జీవితాన్ని అదే ధైర్యంతో, విశ్వాసంతో గడిపాను. ఆంధ్రప్రదేశ్‌ లోనే కాదు 80 దేశాల్లో నాకు మద్దతుగా జనం రోడ్లపై నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజలు నాకు అండగా నిలిచారు. దీంతో మరింత శక్తి పుంజుకున్నా.

  • ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నిజంగా ఏమి జరిగింది?

జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ నాయకత్వం వల్ల ఎన్డీయే విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా మాకు తోడ్పడింది. గత ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓట్లు చీలిపోకూడదని ముందుకు వచ్చారు. ఆ తర్వాత బీజేపీ కూడా చేరింది. మూడు పార్టీలు చేరడం వల్ల ప్రజలకు విశ్వాసం పెరిగింది. 93 శాతం స్ర్టైక్‌ రేట్‌, 57 శాతం ఓటు శాతంతో మేము విజయం సాధించాం. ప్రజలు చాలా తెలివైనవారు. అన్నీ గమనిస్తారు. సరైన సమయంలో తీర్పు ప్రకటిస్తారు. ఏపీలో అదే జరిగింది.


  • బీజేపీ240 సీట్లకే పరిమితమవుతుందని ఊహించారా?

బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని మేము అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ గురించి మాకు పూర్తి స్పష్టత ఉన్నది. ఏకపక్ష ఎన్నికలు జరుగుతాయని అందరూ ఊహించారు.

  • పవన్‌ కల్యాణ్‌ కొంత విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నట్లుంది! సంకీర్ణ ధర్మం అంటే ఏమిటి?

చంద్రబాబు: ఒక కుటుంబంలో ఎప్పుడూ ఇలాంటివి ఉంటాయి. ఒకరు మరొకరిని ఎలా గౌరవించుకుంటారన్నది ముఖ్యం. రాజకీయాల్లో కూడా ఇవే సూత్రాలు వర్తిస్తాయి. కొన్నిసార్లు కొందరు వేరుగా స్పందిస్తారు. ఏదో ఒక సమాచారం ఆధారంగా మాట్లాడతారు. కానీ మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారమవుతాయి. అదే మేము చేస్తున్నాం.

తమిళనాడు సీఎం స్టాలిన్‌లాగే మీరు కూడా మరింతమంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. దక్షిణాదిన ఎంత మంది పిల్లలుండాలి?

చంద్రబాబు: గతంలో నేను బ్రేక్‌ సైలెన్స్‌-టాక్‌ ఎబౌట్‌ ఎయిడ్స్‌ అనే నినాదాన్ని ఇచ్చాను. ఇప్పుడు బ్రేక్‌ సైలెన్స్‌-టాక్‌ ఎబౌట్‌ పాపులేషన్‌ మేనేజ్మెంట్‌ అని పిలుపునిస్తున్నాను. యూరప్‌ దేశాలతో పాటు చైనా, జపాన్‌ సహా అనేక ప్రపంచ దేశాల్లో వయోధికులు ఎక్కువై పోయారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఈ సమస్య ప్రారంభమైంది. 1950లో ఫెర్టిలిటీ రేటు 5.6-6 వరకు ఉండేది. ఇప్పుడు 1.6 మాత్రమే. ఇది ఇంకా తగ్గితే జపాన్‌, చైనా మాదిరి మన దగ్గర సమస్య మొదలవుతుంది. అందుకే పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రమోట్‌ చేయాలనుకుంటున్నాను. అలా చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరు.

  • ఎన్డీయే 3.0 ప్రభుత్వ ప్రత్యేకత ఏమిటి?

చంద్రబాబు: ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్టీయే హయాంలో భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. గత పదేళ్లుగా ఆయన భారత్‌ ప్రాధాన్యం పెంచారు. 2047 కల్లా వికసిత్‌ భారత్‌ ఏర్పడాలని మోదీ కృషి చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో మొదటి లేదా రెండో స్థానాన్ని సాధించగలదనే పూర్తి విశ్వాసం నాకుంది. ఇప్పటికే భారత్‌ మూడో స్థానాన్ని సాధించడం ఖాయమైంది.

Updated Date - Nov 17 , 2024 | 04:16 AM