Caste Census: కులగణన.. అధిక నిధులకే..
ABN , Publish Date - Nov 15 , 2024 | 03:37 AM
‘‘సమాజం నుంచి వచ్చిన డిమాండ్ మేరకు కుల గణన చేపట్టాం. జనాభా దామాషా ప్రకారం నిధులు అందాలంటే కుల గణన జరగాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కుల గణన జరగాలి.
రిజర్వేషన్లు పెరగాలన్నా గణన జరగాల్సిందే
విద్య, ఉద్యోగ అవకాశాలకూ ఇదే మార్గం
సీఎం, మంత్రులు తినే సన్నన్నమే గురుకులాల్లో
విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే జైలే
ప్రజాప్రతినిధులు స్కూళ్లను సందర్శించాలి
11 నెలల్లో అత్యంత సంతోషం ఇచ్చిన రోజిది
ప్రభుత్వ విజయోత్సవాలకు ఇదే ప్రారంభం
బాలల దినోత్సవ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి
చెడు వ్యసనాలకు బానిసలం కాబోమంటూ
విద్యార్థులతో ప్రమాణం చేయించిన సీఎం
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘‘సమాజం నుంచి వచ్చిన డిమాండ్ మేరకు కుల గణన చేపట్టాం. జనాభా దామాషా ప్రకారం నిధులు అందాలంటే కుల గణన జరగాలి. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే కుల గణన జరగాలి. రిజర్వేషన్లు పెరగాలంటే కుల గణన జరగాలి. దీనిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్లీ కుట్రలకు తెరలేపుతున్నారు. వాటిని తిప్పికొట్టే బాధ్యత విద్యార్థులదే. కుల గణన వల్ల ఏ ప్రభుత్వ పథకాలూ ఆగవు. ఏ ఒక్క పథకాన్నీ తొలగించం. మీకు ఇంకా ఎక్కువ నిధులను కేటాయించడానికే ఈ కుల గణనను చేపడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కుల గణనను కేంద్ర ప్రభుత్వం చేపట్టే జన గణనలో భాగం అయ్యేలా చూద్దామని, కేంద్రం మెడలు వంచి, కుల గణనను అందులో చేర్చేలా, రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు పెంచేలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పని చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలతో ఆహారాన్ని పెడితే ఊరుకోబోమని, నాసిరకం అన్నం పెట్టేవారు, సరఫరాదారులు కటకటాలపాలేనని హెచ్చరించారు. సన్న బియ్యంతో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.
పండిట్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ‘బాలల దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ముందుగా నెహ్రూ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంగన్‌వాడీ విద్యార్థుల కోసం ‘ప్రియదర్శిని’ పేరిట రూపొందించిన పాఠ్య పుస్తకాన్ని, ప్రత్యేక యూనిఫామ్‌ను, తెలంగాణ విద్యా ప్రత్యేక సూచికను ఆవిష్కరించారు. చెడు వ్యసనాలకు బానిసలం కాబోమంటూ విద్యార్థులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కలెక్టర్లు వారంలో రెండుసార్లు పాఠశాలలు, గురుకులాలను సందర్శించాలని ఆదేశించాం. అలాగే, నాతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సందర్శించాలి. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు వినాలి. విద్యార్థులే తెలంగాణ ఆత్మ గౌరవం. ఎలాంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకపోతే వారి బంగారు భవిష్యత్తుకు బాట వేసే బాధ్యత ప్రభుత్వానిది’’ అని స్పష్టం చేశారు. లని సూచించారు. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే, వారు కోరిన ఉద్యోగం ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు.
నాసిరకం అన్నం పెడితే కటకటాలే
గురుకులాల్లో నాసిరకం అన్నం, కూరగాయలు పెడుతున్నట్లు ఇటీవల వార్తలు వెలువడుతున్నాయని, కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. నాసిరకం పదార్థాల సరఫరాదారులను, నాసిరకం భోజనం పెట్టేవారిని కటకటాల వెనక్కి తోయాల్సిందేనని, వాళ్లంతా ఊచలు లెక్కపెట్టాల్సిందేని నిర్దేశించారు. ‘‘రాష్ట్రంలో పదేళ్లుగా డైట్ చార్జీలు పెంచలేదు. మేం ఇటీవలే డైట్, కాస్మెటిక్ చార్జీలను 40 శాతం పెంచాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పేదవారు. అందుకే డైట్ చార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే గ్రీన్ చానెల్ ద్వారా విడుదల చేస్తున్నాం. కనక, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి’’ అని స్పష్టం చేశారు. అవసరమైతే కాంట్రాక్టర్ల బిల్లులను పక్కన పెట్టి, డైట్ చార్జీలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే తాము ఇంతవారమయ్యామని, గురుకులాలను తక్కువ అంచనా వేయవద్దని, గురుకులాలే రాష్ట్ర నాయకత్వాన్ని అందించాయని చెప్పారు. సీఎం, మంత్రులు ఏ సన్న బియ్యం అన్నం తింటున్నారో.. గురుకుల విద్యార్థులకు కూడా దానినే పెట్టాలని చెప్పారు. విద్యార్థులే దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే వారవుతారని, దేశాన్ని నిర్మించే డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎ్‌సలు అవుతారని, ఆ గొప్ప లక్ష్యం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు.
మూతపడిన పాఠశాలలను తెరిపించాం
గత పదేళ్లలో ఐదు వేలకుపైగా పాఠశాలలు మూత పడి, దళిత, గిరిజన, ఆదివాసి విద్యార్థులు విద్యకు దూరమయ్యారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తిరిగి తెరిపించామని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వ్యయంతో సమీకృత గురుకుల భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యా శాఖకు బడ్జెట్‌లో అత్యధికంగా 7 శాతం నిధులు అంటే.. రూ.21 వేల కోట్లను కేటాయించామన్నారు. పదేళ్లుగా ఉపాధ్యాయ బదిలీలు జరగలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 21 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, 35 వేల మందిని చిన్న వివాదం కూడా లేకుండా బదిలీలు చేశామని గుర్తు చేశారు. 11,062 టీచర్ పోస్టులను కూడా భర్తీ చేశామన్నారు. గతంలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, డ్రెస్సులు సకాలంలో అందేవి కావని, కానీ.. తాము బడి తెరిచిన మొదటి రోజే అందించామన్నారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని, అటెండర్లను నియమించుకునేలా చేశామని, బ్లాక్ బోర్డులు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.650 కోట్ల నిధులను కేటాయించామని వివరించారు. వర్సిటీల్లో త్వరలోనే బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తామన్నారు. విద్యార్థుల నుంచి వచ్చే వినతులు, ఆలోచనలను అమలు చేయడానికి ప్రభుత్వం వెనక్కిపోదని స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబరు 7న ఎల్బీ స్టేడియంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఈనెల 14 నుంచి డిసెంబరు 9 వరకు విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించామని, వాటికి ఇదే ప్రారంభ కార్యక్రమమని చెప్పారు. ఈ 11 నెలల్లో అత్యధిక సంతోషం ఇచ్చిన రోజు ఇదేనని, విద్యార్థుల సంతోషం, చప్పట్లు, కళ్లలో కాంతి సంపూర్ణమైన విశ్వాసాన్ని కల్పించిందని, వాళ్ల భవిష్యత్తును నిర్మిద్దామని సంకల్పించారు. కాగా, ఎమ్మెల్యేగా పోటీ చేసేవారి వయసు 21 ఏళ్లు ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టండంటూ మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. దీనిని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిద్దామని తెలిపారు.
గత ముఖ్యమంత్రి మిమ్మల్ని కలిశారా!?
‘‘పదేళ్లలో గత ముఖ్యమంత్రిని మీరు చూశారా!? ఆయన్ను కలిశారా? అప్పటి మంత్రి ఎప్పుడైనా మిమ్మల్ని కలిశారా? మీరు ఏం తింటున్నారని అడిగారా? ఆనాటి సీఎం మనవడి కుక్క చనిపోతే డాక్టర్లను జైల్లో వేశారు. కానీ.. మీ గురుకులాల్లో పిల్లలు చనిపోతే, మాసాయిపేటలో బడి బస్సును రైలు ఢీకొని 30 మంది పిల్లలు చనిపోతే అప్పటి సీఎం కనీసం కన్నీళ్లు కూడా కార్చలేదు. మీరు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో మీ రేవంతన్నను కలిశారా లేదా? నేరుగా చేయి కలిపారా లేదా? మీ మధ్యలోకి నడుచుకుంటూ వచ్చిన సీఎంతో చెయ్యి కలిపిండ్రా లేదా?’’ అని ప్రశ్నించి విద్యార్థుల నుంచి సానుకూల సమాధానాలు చెప్పించారు. కొన్ని పాఠశాలల్లో విపరీత పోకడలు చోటు చేసుకుంటున్నాయని, కొంతమంది విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఎలాంటి వ్యసనాలకు బానిసలు కాబోమంటూ మాట ఇవ్వాలి. ఫామ్‌హౌజ్‌లో పడుకున్న కేసీఆర్‌కు వినపడేలా, మొన్న దీపావళి సందర్భంగా చెడు వ్యసనాలతో దావత్ చేసుకున్నవారి గుండెలు పగిలేలా చప్పట్లు కొట్టండి. వ్యసనాలకు దూరంగా ఉంటామని చెప్పండి. వ్యసనపరులకు మీరు సింహస్వప్నం కావాలి’’ అంటూ ప్రమాణం చేయించారు.