Share News

CM Revanth : రాష్ట్రమంతా హైడ్రా

ABN , Publish Date - Sep 04 , 2024 | 03:49 AM

హైదరాబాద్‌ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాలాలు, చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

CM Revanth : రాష్ట్రమంతా హైడ్రా

  • నాలాలు, చెరువులను ఆక్రమిస్తే కూల్చుడే.. అప్పగిస్తే సరే, లేదంటే చర్యలు

  • హైదరాబాద్‌ హైడ్రా తరహాలో జిల్లాల్లో కమిటీలు

  • రాష్ట్రంలో రూ.6 వేల కోట్ల మేర వరద నష్టం

  • కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి

  • రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు సాయంగా ఇవ్వాలి

  • ప్రధాని మోదీని రాష్ట్రానికి రమ్మని కోరాం

  • ప్రజలు కష్టాల్లో ఉంటే కేటీఆర్‌ జల్సాల్లో..

  • హరీశ్‌ హయాంలోనే పువ్వాడ ఆక్రమణలు: సీఎం

  • మహబూబాబాద్‌ జిల్లాలో రేవంత్‌ పర్యటన

  • వరదల్లో మరణించిన మహిళా శాస్త్రవేత్త

  • సోదరుడికి గ్రూప్‌ 1 ఉద్యోగం ప్రకటన

  • బాబును పొగిడిన హరీశ్‌కు మా కష్టం

  • కనబడలేదా?.. మీడియాతో రేవంత్‌ చిట్‌చాట్‌

మహబూబాబాద్‌, ఖమ్మం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా నాలాలు, చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. చెరువులు, నాలాల ఆక్రమణలపై హైదరాబాద్‌ హైడ్రా చేపట్టినట్లుగా స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా సీతారాంతండాతో పాటు పురుషోత్తమయగూడెం ఆకేరు వాగుపై ఒకటిన్నర కిలోమీటర్ల మేర ధ్వంసమైన రోడ్డును, కొట్టుకుపోయిన హైలెవల్‌ వంతెనను ఆయన మంగళవారం పరిశీలించారు.

మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ధనసరి సీతక్కలతో కలిసి సీతారాంతండా వాసులను పరామర్శించారు. వరదలో కొట్టుకుపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లు, పాస్‌ పుస్తకాలు, ఆధార్‌ కార్డులు, ఇతరత్రా విలువైన పత్రాలను తిరిగి కొత్తవి అందజేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వరద నష్టంపై మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, చెరువులు, నాలాలు, బఫర్‌జోన్లను ఆక్రమించి లే-అవుట్‌ చేసి అమ్ముకోవడం వల్లే భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు జనావాసాలను ముంచేస్తోందని, ప్రాణ, ఆస్తినష్టం సంభవిస్తున్నాయని చెప్పారు.

ఆక్రమణలకు సంబంధించి కోర్టుల్లో కేసులుంటే చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదని, ఎంతటి ఒత్తిడి వచ్చినా.. వెనక్కి తగ్గేదే లేదని, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమంగా కట్టడాలు చేపట్టి ఉంటే వెంటనే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని పిలుపునిచ్చారు. ఆక్రమణలకు సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. హైడ్రా తరహాలో జిల్లాలో ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.


30 వేల ఎకరాల్లో పంటనష్టం

మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. సహాయక చర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, వైద్య అధికారులను అభినందించారు. జిల్లాలో అత్యధికంగా 28 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనా అధికారుల సమన్వయంతో పని చేయడం వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం తగ్గిందని చెప్పారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారని, 215 పశువులు చనిపోయాయని, 45 ట్యాంక్‌లు, మూడు పక్కా ఇళ్లు, 15 కచ్చా ఇళ్లు కూలిపోయాయని, 96 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పారు.

Untitled-2 copy.jpg

125 గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని, 680 మందికి వసతి కల్పించామని చెప్పారు. వందమందిని సురక్షితంగా తరలించడంలో ప్రత్యేక కృషి చేసిన సీరోలు ఎస్సై నగే్‌షను అభినందించారు. పురుషోత్తమయగూడెం ఆకేరువాగులో కారు గల్లంతుతో మృతి చెందిన యువ శాస్త్రవేత్త నూనావత్‌ అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్‌ కుటుంబాన్ని వారి స్వగ్రామానికి వెళ్లి సీఎం పరామర్శించారు. మోతీలాల్‌ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. మోతీలాల్‌ కుమారుడికి గ్రూప్‌ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు.

నాలుగు తండాల వారికి మెరక ప్రాంతంలో మోడల్‌ కాలనీ ఏర్పాటు చేసి, ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. వరదల్లో పశువులు మృతి చెందితే రూ.50 వేలు, మేకలు, గొర్రెలకు రూ.5 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. అధికారులు ముంపునకు గురైన ప్రాంతాల్లోని ఇండ్లు, రోడ్లు శుభ్రం చేయడానికి నల్లాలు, ట్యాంకర్ల ద్వారా నీరందించాలని చెప్పారు. ప్రమాదాలు, వరదల నష్టం తరచూ జరిగే ప్రాంతాలను గుర్తించి, బ్లూబుక్‌ తయారు చేసి కలెక్టరేట్‌లో ఉంచాలని చెప్పారు.


విపత్తును గుర్తించడానికి పీఎంకు ఆహ్వానం

వరదల్లో రూ.6 వేల కోట్లు నష్టం వాటిల్లిందని, విపత్తు గుర్తించి అర్థం చేసుకుని తగిన సాయం అందించడానికి ప్రధాని మోదీని రాష్ట్రానికి ఆహ్వానిస్తూ లేఖ రాశామని రేవంత్‌ తెలిపారు. జాతీయ విపత్తుగా గుర్తించి రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాని వస్తే నష్టం నివేదిక అందించడానికి అన్ని శాఖల అధికారులు సమగ్ర వివరాలతో సమాచారం అందించాలని ఆదేశించారు.

Untitled-2 copy.jpg

పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ఎప్పుడైనా వచ్చారా?

గత పదేళ్లలో కేసీఆర్‌ పాలనలో వర్షాలు.. వరదలు వచ్చినప్పుడు ఏనాడైనా ప్రజలను పరామర్శించేందుకు వచ్చాడా? అని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో మరణాలు సంభవించినా పోలేదన్నారు. కొందరు నాయకులు ఇప్పుడే సీఎం అయ్యారుగా.. అందుకే తిరుగుతున్నారని అనడం విచారకరమని వ్యాఖ్యానించారు. నాలుగు రోజులుగా రాష్ట్రంలో వర్ష భీభత్సం కొనసాగుతుంటే కేటీఆర్‌ ఆమెరికాలో జల్సా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు నాలుగు రోజుల తర్వాత బయటకు వచ్చి, నాలుగు ప్రాంతాలు తిరిగి తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. హరీశ్‌కు చిత్తశుద్ధి ఉంటే ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ చేసిన ఆక్రమణలు తొలగించాలని డిమాండ్‌ చేయగలరా? వాటిని తొలగించడంలో చిత్తశుద్ధితో సహకరిస్తారా అని ప్రశ్నించారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు వరద బాధితుల సాయం కోసం ముందుకు రావాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 04 , 2024 | 03:53 AM