ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌పై వెనక్కి వెళ్లలేం
ABN , Publish Date - Sep 23 , 2024 | 04:21 AM
రీజినల్ రింగు రోడ్డు అలైన్‌మెంట్ మార్పుపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి వెళ్లడం కష్టమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
బాధితులకు నష్టపరిహారం పెంచే యత్నం చేస్తా
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సమస్యలన్నీ పరిష్కరిస్తా
సీపీఎం ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్
హైదరాబాద్, సిరిసిల్ల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు అలైన్‌మెంట్ మార్పుపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి వెళ్లడం కష్టమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ భూ సేకరణను ముందుగా నిర్ణయించిన అలైన్‌మెంట్ ప్రకారమే చేపట్టాలంటూ సీపీఎం ప్రతినిధులు బీవీ రాఘవులు, ఎస్ వీరయ్య, సీతారాములు, జూలకంటి రంగారెడ్డి తనను సచివాలయంలో కలిసిన సందర్భంగా రేవంత్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే బాధితులకు నష్టపరిహారం పెంచే ప్రయత్నం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సిరిసిల్లలో పవర్‌లూమ్‌ల కరెంటు ఛార్జీలను ప్రభుత్వం యూనిట్‌కు రూ.2 నుంచి రూ.8.30కు పెంచడంతో 30 వేల మంది పవర్‌లూమ్ కార్మికులు ఆందోళనలో ఉన్నారని సీఎంకు సీపీఎం ప్రతినిధి బృందం వివరించింది. గతంలో ఉన్న విధంగా యూనిట్‌కు రూ.2 చొప్పున వసూలు చేసి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సమస్యను పరిష్కరిస్తానని, పవర్‌లూమ్ పరిశ్రమను నాలుగో కేటగిరీ కిందకు తీసుకొస్తామని సీఎం హామీ ఇచ్చారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అందించాలని కూడా సీపీఎం ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. కాగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.