CM Revanth Reddy : చెరువుల్లో శ్రీమంతుల ఫాంహౌస్‌లు
ABN , Publish Date - Aug 26 , 2024 | 05:25 AM
నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చివేతకు స్ఫూర్తి ‘భగవద్గీత’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
భగవద్గీత స్ఫూర్తితోనే ఆక్రమణల కూల్చివేతలు
శ్రీకృష్ణుడి యుద్ధనీతిని పాటిస్తున్నాం
చర్యలు తీసుకోకుంటే మేం విఫలమైనట్టే!
కక్షసాధింపులు లేవు: తెలంగాణ సీఎం రేవంత్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): నగరంలోని అక్రమ కట్టడాలను కూల్చివేతకు స్ఫూర్తి ‘భగవద్గీత’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ధర్మాన్ని రక్షించేందుకు ‘గీత’లో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతి స్ఫూర్తితోనే ప్రజల జీవన విధానంలో, సంస్కృతిలో భాగమైన చెరువులను సంరక్షించే మహాయజ్ఞానికి తమ ప్రభుత్వం నాంది పలికిందని చెప్పారు.
‘‘ప్రజా ప్రతినిధులు విధి నిర్వహణలో భాగంగా తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని సవరించుకోడానికి తెలిసి కొన్ని మంచిపనులు కూడా చేయాలన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఆ క్రమంలోనే చెరువులను కబ్జాదారుల చెర నుంచి విముక్తి చేయాలన్న ఏకైక లక్ష్యంతో.. మా మీద ఎంత ఒత్తిడి వచ్చినా, ఎవరినీ వదలకుండా ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఆదివారం హరేకృష్ణ భక్తి ఉద్యమం ఆధ్వర్యంలో కోకాపేటలో చేపట్టిన హరేకృష్ణ హెరిటేజ్ టవర్స్ నిర్మాణ ప్రక్రియలోని అనంత శేష స్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను వరదల నుంచి సంరక్షించడం కోసం ఆనాడు నిజాం ప్రభుత్వం.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి నిపుణుల సూచనలతో హియాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలను నిర్మించింది.
మొన్నటికి మొన్న కృష్ణా, గోదావరి ఎండిపోయి, వేసవిలో తాగునీటి సమస్య వస్తే.. ఈ జలాశయాలే నగరవాసుల దాహార్తిని తీర్చాయి. అలాంటిది కొంతమంది శ్రీమంతులు, గొప్పవ్యక్తులుగా పేరొందిన వారు చెరువుల్లో ఫాంహౌ్‌సలు నిర్మించుకొని, వాటి నుంచి పారే మురుగు కాల్వలను నగరానికి తాగునీరు సరఫరా చేసే జంట జలాశయాల్లో కలిపారు.
సామాన్యుల తాగునీటి చెరువుల్లో మురుగు నీరు కలపడాన్ని చూస్తూ ఊరుకొంటే, అక్రమ నిర్మాణాలను అలానే వదిలేస్తే ఇక నేను ప్రజా ప్రతినిధిగా విఫలమైనట్టా? కాదా?’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
అందుకే తనపై ఎంత ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫాంహౌ్‌సలున్నా.. ఏవీ వదలకుండా హైడ్రా సంస్థను ఏర్పాటు చేశామని, చెరువుల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నామని వివరించారు.
కాగా, చెరువులను ఆక్రమించిన వారిలో కొందరు ప్రభుత్వాన్ని, సమాజాన్ని అత్యంత ప్రభావితం చేయగలిగిన స్థానాల్లో ఉన్నారని, మరికొందరు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములుగానూ ఉండవచ్చునని, అయినా వాటిని పట్టించుకోదలచుకోలేదని అన్నారు.
సెంటు కూడా ఆక్రమించలేదు: నాగార్జున
ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే అధికంగా ఉన్నాయని సినీ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు.
తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించిన భూమి పట్టా భూమి అని, ఒక్క సెంటు కూడా ఆక్రమించింది కాదని ఎక్స్‌లో ఆదివారం పోస్టు పెట్టారు.
తమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ఏపీ ల్యాండ్ గ్రాబింగ్(ప్రొహిబిషన్) యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానం 2014లో తీర్పు ఇచ్చిందన్నారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ఊహాగానాలు నమ్మవద్దని అభిమానులను కోరారు.
నాగార్జున హరిశ్చంద్రుడు కాదు: సీపీఐ నారాయణ
నాగార్జున ఏమీ సత్యహరిశ్చంద్రుడు కాదని, ఆయన ఎన్ కన్వెన్షన్ మీద భారీగా సంపాదించారని సీపీఐ నేత కె. నారాయణ అన్నారు. మాదాపూర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేసిన ఎన్ కనెన్షన్ ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేసే అధికారులు, పాలకులు.. నాగార్జున ఏకంగా చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మిస్తే ఏళ్ల తరబడి చోద్యం చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
అదేవిధంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెరువుల్లో కళాశాలలు కట్టారని.. వారం తాకబ్జాకోరులని ఆరోపించారు. పెద్దలు కబ్జాలు చేసినా, దొంగ పట్టాలు పొం దినా వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.