Share News

CM Revanth: తెలంగాణ బాపు కేసీఆర్ కాదు.. ఆయనే అసలైనోడు..!

ABN , Publish Date - Mar 10 , 2024 | 09:03 PM

విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని మాజీ సీఎం కేసీఆర్ (KCR) పచ్చి అబద్దాలు మాట్లాడుతారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ...తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య , శ్రీకాంతాచారి లాంటి వారు తెలంగాణ ఉద్యమంలో అమరులయ్యారని చెప్పారు.

CM Revanth: తెలంగాణ బాపు కేసీఆర్ కాదు.. ఆయనే అసలైనోడు..!

హైదరాబాద్: విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని మాజీ సీఎం కేసీఆర్ (KCR) పచ్చి అబద్దాలు మాట్లాడుతారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ...తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య , శ్రీకాంతాచారి లాంటి వారు తెలంగాణ ఉద్యమంలో అమరులయ్యారని చెప్పారు. తెలంగాణ బాపు(కేసీఆర్‌ని ఉద్దేశించి) అని తనకు తానే చెప్పుకుంటుండు.. అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలి కదా అని ప్రశ్నించారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అనే స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని చెప్పారు. తెలంగాణలో ఆదాయం పడిపోయిందని.. ఆదాయం కోసం కేవలం లిక్కర్ పైనే ఆధారపడేలా కేసీఆర్ పాలన సాగిందని అన్నారు.

మొదటి తారీఖు ఉద్యోగులకు జీతాలు వేసినా తాము ప్రచారం చేసుకోలేదని అన్నారు. ఆదివారం నాడు ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పదేళ్లుగా సమస్యలు చెప్పుకోవడానికి మీకు అవకాశం రాలేదు.. ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. మీ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిందని.. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని వివరించారు. ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమేనని అన్నారు. నిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి భ్రమ అని మండిపడ్డారు.

కేబినెట్‌లో ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటా...

సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదు.. చర్చలేనని తెలిపారు. విశ్వాసం కల్పించడానికే మీతో చర్చలు జరిపామని అన్నారు. ఇప్పటికే మీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. ఈ విషయంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధమని అన్నారు. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. ఒక్కో చిక్కుముడిని పరిష్కరిస్తూ ఉద్యోగాల భర్తీని ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. 11వేల పైచిలుకు ఉద్యోగాలతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశామని అన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నామని అన్నారు. తమ ప్రభుత్వం మూడు నెలలు ఉంటుందని.. ఆరు నెలలు ఉంటుందని కొందరు మాట్లాడుతున్నారని.. తమ ప్రభుత్వం అంటే వారు తమాషా అనుకుంటున్నారా? అని హెచ్చరించారు. తాము అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని..ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని తెలిపారు.

పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమన్నారు. ప్రతిపక్ష నాయకుడికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉండాలన్నారు. 95శాతం మంది ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారని అన్నారు. సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే... ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని అన్నారు. శాఖలవారీగా సంఘాలు ఉండాల్సిందేనని తెలిపారు.. మంత్రివర్గ ఉపసంఘం శాఖలవారీగా సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని వివరించారు. సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోమన్నారు. వివిధ శాఖల్లో ఉన్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గవర్నర్ తమిళి సైతో మాట్లాడి కోదండరాం సార్‌ను శాసన మండలికి పంపుతామని చెప్పారు. ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలికి గౌరవమని అన్నారు. ఉద్యోగుల డీఏతో పాటు ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 09:33 PM