Share News

CM Revanth Reddy: జర్నలిస్టులకు కొత్త పాలసీ!

ABN , Publish Date - Sep 09 , 2024 | 03:19 AM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌ చెప్పారు.

CM Revanth Reddy: జర్నలిస్టులకు కొత్త పాలసీ!

  • అక్రిడిటేషన్‌, ఆరోగ్య కార్డులకు శాశ్వత పరిష్కారం

  • వృత్తి పరమైన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి

  • కొన్ని పత్రికలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయ్‌

  • భాష, పదప్రయోగంలో విజ్ఞత పాటించాలి

  • జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకి భూమి

  • పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌

  • ఫ్యూచర్‌ సిటీలో ఫోర్త్‌ ఎస్టేట్‌కు త్వరలో స్థలాలు

  • మీడియా అకాడమీకి 10 కోట్లు ఇస్తామని ప్రకటన

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాం: పొంగులేటి

హైదరాబాద్‌/రవీంద్రభారతి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌ చెప్పారు. అక్రిడిటేషన్‌, ఆరోగ్య భద్రత కార్డులు జారీ విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. చిన్న, మధ్య, పెద్ద తరహా పత్రికలను గుర్తించి.. కేంద్రం, ఈసీ మార్గదర్శకాలు, రాజకీయ పార్టీల సొంత జర్నలిజం లాంటి అంశాలన్నింటినీ క్రోడీకరించి కొత్త విధివిధానాలను రూపొందించాలని మీడియా అకాడమీకి సూచించారు. వాటిపై చర్చించి, మంత్రివర్గంలో ఆమోదింపజేసుకుని, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఆ బాధ్యత తనదేనని సీఎం స్పష్టంచేశారు.


ఒక వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేస్తే, అన్నీ దాని ప్రకారమే నడుస్తాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు, శాఖలు కూలిపోయే స్థితికి వచ్చాయని.. వాటిని బలోపేతం చేసి, ముందుకు తీసుకెళ్లడానికే సుదీర్ఘ సమీక్షలు చేస్తూ, విదివిధానాలను ఖరారు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకం, క్రీడలు, విద్యుత్తుకు విధానాలే లేవని.. అసలు తెలంగాణ రాష్ట్రానికే ఒక పాలసీ అంటూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా సమన్వయం చేసుకుంటూ.. శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీ సుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వమనే బండిని న డపడం అంత ఆషామాషీ కాదన్నారు.


ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ‘జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ’కి పేట్‌బషీరాబాద్‌లోని 38 ఎకరాల భూమి పత్రాలను అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. జేఎన్‌జే సొసైటీలో లేని ఇతర జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలా లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. మిగిలిన జర్నలిస్టులకు ప్రభుత్వం నిర్మించబోయే ఫోర్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీలో స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జేఎన్‌జేకు ఇచ్చిన భూమితో పాటు చేయగలిగిన సాయం కూడా చేస్తామని చెప్పారు. కాగా, మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ.లక్ష చెక్కులను అందించారు. అదేవిధంగా ఆ కుటుంబంలో చదువుకునే విద్యార్థులకు ఒకటి నుంచి పదో తరగతి వరకు నెలకు రూ.1000 స్టైపెండ్‌ అందించనున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి చెప్పారు.


  • కొన్ని పత్రికలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయ్‌

నిజమైన జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్‌, ఆరోగ్య భద్రత కార్డు, ఇంటి పట్టాల విషయంలో ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధత్య తమ ప్రభుత్వానిదని సీఎం చెప్పారు. తమ సిద్ధాంతాలను రాసుకోవాల్సిన పత్రికలు కూడా భాష విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పత్రికా భాష, పదప్రయోగంలో విజ్ఞత ఉండాలని సూచించారు. ‘కొంత మందికి రేవంత్‌రెడ్డి నచ్చకపోవచ్చు. కానీ.. ఇప్పుడు అతను ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. వ్యక్తిగా కాకుండా ఆ పదవిని గౌరవించైనా రాయాలి కదా?’ అని అన్నారు. ప్రజల కోసం పనిచేసే, వారి సమస్యలను వెలికి తీసే జర్నలిస్టులు ఒక వర్గంగా ఉంటే.. కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నవారు మరో వర్గంగా ఉన్నారని రేవంత్‌ చెప్పారు. ఈ రెండు వర్గాలను విడదీయాలన్నారు.


లేకపోతే నిజమైన జర్నలిస్టులకు నష్టం జరుగుతుందని తెలిపారు. అసెంబ్లీ, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లోకి జర్నలిస్టులను అనుమతించడానికి అభ్యంతరం లేదని సీఎం చెప్పారు. కానీ, అందుకోసం సరైన కార్డులను తీసుకొని, సరైన విధానంలో రావాలని స్పష్టం చేశారు. సచివాలయంలోకి ఎవరు రావాలి? పత్రిక సర్క్యులేషన్‌ ప్రకారం ఎంతమందికి పాసులు ఇవ్వాలి? అనే విషయంపైనే తమ తదుపరి అడుగు ఉంటుందని చెప్పారు. అసెంబ్లీకి వచ్చే జర్నలిస్టులకు కూడా సీనియారిటీ, అనుభవాలను గుర్తించి.. పాసులు ఇస్తే సీఎం సహా ఎవరిని కలవాలన్నా నియంత్రణలు ఉండబోవని తెలిపారు. అనుభవజ్ఞులైన జర్నలిస్టులతో ఇష్టాగోష్టి నిర్వహించినప్పుడు ‘ఆన్‌ రికార్డు, ఆఫ్‌ ద రికారు’్డ అని మాట్లాడిన వాటిని వారు మరోచోట ప్రస్తావించేవారు కాదన్నారు. ఇష్టాగోష్టిలో స్నేహితుల్లాగా యథాలాపంగా మాట్లాడతామని, అలాంటి వ్యాఖ్యలను కూడా రికార్డు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.


  • రాజకీయాన్ని చిన్నచూపు చూసే దుస్థితి..

జర్నలిస్టులంటే సమాజానికి చికిత్స చేసే డాక్టర్లని మాజీ సీఎం రాజశేఖరరెడ్డి పేర్కొన్నారని రేవంత్‌ గుర్తుచేశారు. జేఎన్‌జే సొసైటీ ఇళ్ల స్థలాలను అందించే అంశంలో జాప్యం జరగడంపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ ఏర్పాటు జటిలమైన సమస్య అని, అలాంటి దానికే కాంగ్రెస్‌ పరిష్కారం చూపిందని చెప్పారు. జవహర్‌లాల్‌ నెహ్రూ పేరు మీద ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీకి సోనియాగాంధీ ప్రతినిధులుగా ఈ సమస్యను పరిష్కరించడం తమ బాధ్యతగా భావించే పరిష్కరించామని తెలిపారు. ఇప్పటికే దాదా పు 73 మంది ఈ నిజాన్ని చూడకముందే కన్నుమూశారని, అలాంటి పరిస్థితి, నష్టం ఎవరికీ జరగకూడదన్న ఆలోచనలో భాగంగానే శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు. వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరో పెంచరని, మనకి మనమే పెంచుకోవాలని విలేకరులకు సూచించారు.


ప్రస్తుతం రాజకీయ వృత్తిని సమాజం చిన్నచూపు చూసే దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వారి అవసరాలకు లేదా వారి బంధు మిత్రుల కోసమే పనిచేస్తారనే చర్చ ప్రజల్లో రావడమే ఇందుకు కారణమని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులు ఉన్మాదంగా మారి.. ప్రెస్‌మీట్‌ లేదా జరుగ ుతున్న కార్యక్రమాలను ఇబ్బందిపెట్టే పరిస్థితులు నెలకొన్నాయ ని చెప్పారు. అయితే అలాంటి పత్రికల్లో పనిచేస్తున్న వారంతా ఇలానే ఉన్నారని తాను అనడం లేదని, కొంద రు ఉన్నారని, వారిని నియంత్రించుకుంటూ ఎలా ముం దుకెళ్లాలో చెప్పాలని కోరారు.


గతంలో సచివాలయానికి ప్రజాప్రతినిధులుగా తామే వెళ్లలేకపోయేవాళ్లమని.. కానీ, ఇప్పుడు సీఎం కా ర్యాలయానికి జర్నలిస్టులు వచ్చి కూర్చోవడంతో పాటు చిట్‌చాట్‌లు, ప్రెస్‌మీట్లకు అక్కడి నుంచే హాజరవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నింటినీ సచివాలయం నుంచే జర్నలిస్టులు రాసేలా తమ ప్రభుత్వం మార్పు తెచ్చిందన్నారు. కొన్ని రాజకీ య పార్టీలకు చెందిన పత్రికల్లో పనిచేసే వారు మంత్రుల కార్యాలయాలు, మరికొన్నిచోట్లకు వెళ్లి కూర్చోవడంతో పాటు కొన్ని విషయాల్లో అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చేందుకు పాసులు ఇచ్చినా లేదా ప్రెస్‌మీట్‌ నిర్వహించినా.. గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్చీ దొరకడం లేదన్నారు. ఈ పద్ధతికి ముగింపు పలకాల్సిందేనని చెప్పారు.


  • నేనూ హౌసింగ్‌సొసైటీకి 10 లక్షలు చెల్లించా

ఎమ్మెల్సీగా తాను కూడా ఒక హౌసింగ్‌ సొసైటీలో సభ్యుడినేనని, రూ.10 లక్షలు చెల్లించానని, అయినా ఇప్పటికీ తనకు ఇంటి పట్టా రాలేదని సీఎం రేవంత్‌ అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు.. మరి మనకు పట్టా ఎప్పుడు వస్తుందంటూ తన కుటుంబ సభ్యులు అడుగుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.


  • ఫ్యూచర్‌ సిటీలో భాగస్వాముల్ని చేస్తాం..

జర్నలిస్టుల శిక్షణ, వివిధ అవసరాల నిమిత్తం ప్రెస్‌ అకాడమీకి రూ.10 కోట్లు అందజేయనున్నట్లు సీఎం రేవంత్‌ ప్రకటించారు. జేఎన్‌జే మినహా మిగిలిన జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఆ బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తున్నట్టు తెలిపారు. వారి నేతృత్వంలో జర్నలిస్టులంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఫైల్‌ తన దగ్గరకు తీసుకొస్తే అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. జర్నలిస్టులు ఎవరూ తమకు స్థలం రాదనే ఆందోళన, ఆవేదనకు గురి కావొద్దని, అర్హులైన జర్నలిస్టులను ఫ్యూచర్‌ సిటీలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. గతంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ నిర్మిస్తే.. ఇప్పుడు మనమంతా కలిసి నాలుగో నగరం ‘ఫ్యూచర్‌ సిటీ’ని నిర్మిద్దామని సీఎం పిలుపునిచ్చారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్‌ సిటీలో అన్నీ ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. అందులో జర్నలిస్టులు లేకపోతే అది అసంపూర్తిగా ఉంటుందని, అందుకే జర్నలిస్టులను కూడా అక్కడికి తీసుకెళ్తానని చెప్పారు.


  • ఏళ్ల సమస్యను పరిష్కరించాం మంత్రి పొంగులేటి

జేఎన్‌జే సంఘం ప్రతినిధులకు సీఎం రేవంత్‌ చేతుల మీదుగా భూమి స్వాధీన పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలతో పాటు మీడియా మిత్రుల సహకారంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టుల 18 ఏళ్ల కోరికను నేడు తీర్చగలిగామని చెప్పారు. ఇళ్ల స్థలాలు పొందిన సభ్యులంతా ఇప్పు డు కోటీశ్వరులని హర్షం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నారు. మీడి యా అకాడమీ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడు తూ.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జర్నలిస్టుల సమస్య పరిష్కారమైందన్నారు.


సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీనివా్‌సరెడ్డి చొరవతోనే ఇది సాధ్యమైందని చెప్పా రు. హైదరాబాద్‌ జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలా లు కేటాయించేందుకు ప్రయత్నం జరగాలని కోరా రు. దేశంలో ఎక్కడా లేని విధంగా మనదగ్గర 24 వేల అక్రిడిటేషన్‌ కార్డులు ఉన్నాయన్నారు. 2016 అక్రిడిటేషన్‌ నిబంధనల్లో చాలా పొరపాట్లు ఉన్నాయని చెప్పారు. భాషా ప్రాతిపదికన అక్రిడిటేషన్‌ కార్డుల విభజన జరగకూడదన్నారు. మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టులకు శిక్షణ శిబిరాలు నిర్వహించాల్సిన అవసరముందని చెప్పారు. కొంతమంది అనర్హులు కూడా జర్నలిస్టులమని చెప్పుకొంటూ వృత్తి గౌరవాన్ని తగ్గిస్తున్నారని వాపోయారు. ఈ విషయంలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు అనిల్‌కుమార్‌యాదవ్‌, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతారెడ్డి, జేఎన్‌జేహెచ్‌ఎ్‌స డైరెక్టర్లు వంశీ శ్రీనివాస్‌, కిరణ్‌కుమార్‌, రవికాంత్‌రెడ్డి, రమణారావు, అశోక్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్ట్‌ దేవులపల్లి అమర్‌, పాత్రికేయుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 03:19 AM