CM Revanth Reddy: రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా.. కాళేశ్వరం కూలిపోయింది: సీఎం రేవంత్
ABN , Publish Date - Sep 26 , 2024 | 07:02 PM
బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. అది కళ్ల ముందే కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జలసౌధలో ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం, దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గురువారం పాల్గొన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. అది కళ్ల ముందే కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జలసౌధలో ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం, దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి గురువారం పాల్గొన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటే మొత్తం సాగునీటి పారుదల శాఖే ఉండదని పేర్కొన్నారు.
"తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయం, నీరు. సాగునీటి పారుదల శాఖలో పని అంటే ఉద్యోగం కాదు.. ఓ భావోద్వేగం. ఇంజినీర్లు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి" అని రేవంత్ సూచించారు.
నెల రోజుల్లో హెల్త్ కార్డులు..
ప్రజలందరికీ నెల రోజుల్లోనే హెల్త్ కార్డులు అందజేస్తామని రేవంత్ వెల్లడించారు. "ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయబోతున్నాం. ప్రజల మెడికల్ హిస్టరీ వైద్యులకు అందుబాటులో ఉండేలా చూస్తాం. క్యాన్సర్‌తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందరికీ వైద్యం అందేలా చూడటం మనందరి బాధ్యత. వైద్య ఖర్చుల్లో ఎక్కువగా టెస్టులే ఉంటున్నాయి. క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహమ్మారి చికిత్స పేదలకు భారమవుతోంది.
రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఆసుపత్రికి వెళ్తే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య గుర్తింపు కార్డులు లేకపోవడం వల్లే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అందుకే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకున్నాం" అని రేవంత్ తెలిపారు.
"నీళ్లు, నియామకాల ఆకాంక్ష నెరవేరడం కోసమే తెలంగాణ ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువగా ప్రభావం చూపించగలరు. పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచుల స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజినీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేశాకే రిపోర్టులు ఇచ్చేవారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టారు. అది కట్టడం కూలడం రెండూ జరిగాయి. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పండి. అధికారులనా? రాజకీయ నాయకులనా? మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్ మెంటే ఉండదు.
చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు.
లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏంటో గుర్తించండి.
రూ. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం. ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి. రికమెండేషన్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్‌ల మీద కాదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి" అని రేవంత్ పేర్కొన్నారు.
Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల
Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన బాధితురాలి లాయర్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి